తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంది. అందుకే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. రజిని నటించిన రోబో '2.0' సినిమాకి తెలుగు హక్కులను తెలుగు నిర్మాతలు ఏకంగా 80 కోట్లు పోసి కొన్నారు. అలాంటి రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే తెలుగు హీరోలు తమ సినిమా విడుదలను ఆపుకోవడమో... లేకుంటే ప్రీ పోన్ చేసుకోవడమో చేస్తారు. ఇక నిన్న మొన్నటిదాకా రజిని నటించిన 'రోబో' సినిమా ఏప్రిల్ లో వస్తుందని లైకా వారు ప్రకటించడం మొదలు తెలుగులో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' నిర్మాతలు, మహేష్ 'భరత్ అనే నేను' నిర్మాతలు తోక తొక్కిన పాముల్లా విరుచుకుపడ్డారు. అయినా తొణకని లైకా వారు సైలెంట్ గా చోద్యం చూశారు. ఇక రోబో ఏప్రిల్ లో వస్తే రజిని మరో మూవీ 'కాలా'ని ఆ సినిమా నిర్మాత ధనుష్ ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు.
ఇక 'రోబో' ఏప్రిల్ నుండే పోస్ట్ అంటూ వార్తలు రావడం, 'కాలా' సినిమా ఏప్రిల్ లో రావడం అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో చూద్దాం ఏమవుతుందో అని 'నా పేరు సూర్య' నిర్మాతలు, 'భరత్ అనే నేను' నిర్మాతలు చూస్తున్నారు. ఇంతలో 'రోబో' విషయం పక్కన పడేసి రజినీకాంత్ 'కాలా' ని ఏప్రిల్ 27 న విడుదల అంటూ ధనుష్ తోపాటు రజిని కూడా అధికారిక ప్రకటన చెయ్యడం చూస్తుంటే.. మనకెందుకు తెలుగు హీరోలు ఎలాపోతే అన్నట్టుగా ఉంది కదూ సూపర్ స్టార్ వ్యవహారం.
మరి ఇప్పటికే రోబో నిర్మాతలపై పళ్ళు నూరుతున్న నా పేరు సూర్య, భరత్ అనే నేను నిర్మాతలు ఇప్పుడు ధనుష్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో... లేదంటే సైలెంట్ గా తమ సినిమాలను ఏప్రిల్ 27 నుండి తప్పించి డేట్స్ మార్చుకుంటారో.