ఒక సినిమా విడుదలవుతుంది అంటే... ఆ సినిమాకి మొదటి షో చూసేసి సినిమాని టాప్ టు బోటం దాకా చదివేసినట్టుగా ఒక రివ్యూ ఇచ్చేస్తారు రివ్యూ రైటర్స్. ఒక్కోసారి సినిమా కలెక్షన్స్ కి ఆ రివ్యూలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ కొన్నిసార్లు కేవలం రివ్యూస్ వలన ఆ సినిమా కలెక్షన్స్ తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయి. బిసి సెంటర్స్ వారికి అసలు సినిమా రివ్యూ తో పనేం ఉండదు. కానీ క్లాస్ ఆడియెన్స్ కి మాత్రం ఈ రివ్యూ చూసుకుని మరి సినిమాకి వెళ్లే సందర్భాలు చాలానే ఉంటాయి. కొన్నిసార్లు రివ్యూ వలన లాభాలున్నా... మరికొన్నిసార్లు ఆ రివ్యూస్ వలన అనేక సమస్యలు వచ్చేస్తున్నాయి. అసలు సినిమా చూస్తూ కొంతమంది ఆ సినిమాకి సంబందించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు వెబ్సైట్స్ లో పోస్ట్ చేస్తూ సినిమా ఎలా ఉందో చెప్పేస్తున్నారు.
ఇప్పుడు అలాంటి రివ్యూ రైటర్స్ మీద ఒక సీనియర్ హీరో కన్నెర్రజేశాడు. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు మంచు మోహన్ బాబు. మోహన్ బాబు హీరో, విలన్ గా నటించిన 'గాయత్రి' గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి మరి పాజిటివ్ కాదు.. నెగెటివ్ కాకుండా రివ్యూస్ ఇచ్చారు క్రిటిక్స్. అయితే అలాంటి రివ్యూ రైటర్స్ ని, మోహన్ బాబు సినిమాని వీక్షిస్తూ ఆ సినిమాకి సంబందించిన అప్ డేట్స్ ని పోస్ట్ చేసేవారికి పంచ్ లు పేల్చాడు. కొందరు కనీసం సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయకుండా... ఒక పక్క సినిమా చూస్తూ సీన్ సీన్ కి మధ్య రివ్వూ రాసేస్తూ పోస్ట్ చేసేస్తుంటారు.
ఆ రివ్యూని చూసి కొందరు ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తుంటారు... కొందరు అసలు రారు... అయినా ఒకరు రాసిన ఆ రివ్యూ ని ప్రేక్షకులు ఎలా నమ్ముతారు. అసలు మీరే సినిమా చూసి.... ఆ సినిమా బావుందో లేదో తేల్చవచ్చుగా... అలాగే ఇంట్లో కూర్చుని ఆ రివ్యూ చూసి సినిమాకి రావద్దని మోహన్ బాబు ప్రేక్షకులను కోరుతున్నారు.
ఎందుకంటే ఆ రివ్యూ ఇచ్చే క్రిటిక్ ఆయా సినిమా హీరోకి అభిమాని కావచ్చు... లేకుంటే వేరే హీరో చేతిలో కీలుబొమ్మ కావచ్చు... అని చెప్పడమే కాదు. అసలు ఒక్క క్రిటిక్ సినిమా చూసి విమర్శించడం కన్నా...ఒక పాతికమంది ఒకే చోట సినిమా చూసి అందరూ చర్చించుకుని మరీ రివ్యూ ఇవ్వొచ్చు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈయన.