మోహన్‌బాబు నటించిన 'గాయత్రి' ఫర్వాలేదనిపించుకుంది. వినాయక్-సాయిధరమ్‌తేజ్‌ల 'ఇంటిలిజెంట్' బోల్తాపడింది. దీంతో మరో మెగాహీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న వైవిధ్య ప్రేమకధా చిత్రం 'తొలిప్రేమ'పై భారీ అంచనాలున్నాయి. అందునా ఈ చిత్రం హక్కులను దిల్‌రాజు తీసుకోవడం విశేషం. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ 'తొలిప్రేమ' చిత్రం ద్వారా వెంకీ అట్లూరి అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం గురించి వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. బాబాయ్ నటించిన 'తొలిప్రేమ'కి మా 'తొలిప్రేమ'కి ఏమాత్రం సంబంధం లేదు. నాటి జనరేషన్‌కి తగ్గట్లు అది రూపొందితే, నేటి జనరేషన్‌కి తగ్గట్లు ఈ 'తొలిప్రేమ' రూపొందింది. నాటి రోజుల్లో ఇష్టపడిన వారి అమ్మాయికి డైరెక్ట్‌గా ఐ లవ్ యు అని చెప్పాలంటే భయపడేవారు. దాంతో ఆ చిత్రంలో హీరోయిన్ కోసం లెటర్ రాస్తాడు.
కానీ నేటి జనరేషన్ వేరు. ఇందులో నేను చేసేదంతా కరెక్ట్ అనుకునే స్వభావం నాది. హీరోయిన్ అన్ని విధాలుగా ఆలోచించేరకం. 'ఊహలుగుసగుసలాడే' చిత్రం చూసి ఈ పాత్రకు రాశిఖన్నా అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుందని భావించి ఆమెని తీసుకున్నాం. ఇక నాకు మొదటి నుంచి సినిమాలు చూసే అలవాటు బాగుండేది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా చూసేవాడిని. ఆయా భాషల్లో వచ్చినట్లు తెలుగులో విభిన్నచిత్రాలు ఎందుకు రావడం లేదు అని ఆలోచించేవాడిని, నేను నటుడిని అయిన తర్వాత స్టార్‌ని కావాలని కాకుండా వైవిధ్యచిత్రాలు, పాత్రలు చేయాలని భావించాను. అలా చేసిన చిత్రాలే 'కంచె. ఫిదా'. ఈ చిత్రానికి 'ఫిదా'కి ఏమీ పోలిక ఉండదు. ఈ చిత్రం తర్వాత 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్‌రెడ్డితో అంతరిక్ష నేపధ్యంలో ఓ చిత్రం చేస్తున్నాను.
ఈ చిత్రంలో నా కాలేజీ గెటప్ పాత్ర నాకెంతో నచ్చింది. ఆ షూటింగ్‌ని బాగా ఎంజాయ్ చేశాను. నేను ఎవ్వరినీ ప్రేమించలేదు. నా స్నేహితులు ప్రేమలో ఉన్నారు. కొందరు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. నేను ఎవ్వరినీ ప్రేమించలేదు. అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు సిగ్గు ఎక్కువ. అలాంటి నాకు కూడా ఓ ప్రేమ అనుభవం ఎదురైంది. నేను భారతీయ విద్యామందిర్‌లో చదువుకునే రోజుల్లో 9వ తరగతిలో ఓ అమ్మాయి పరిచయం అయింది. చొరవగా మాట్లాడి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. దాన్ని ఏమంటారో తెలియదు కొంతకాలం మాట్లాడుకున్నాం. తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి.. అని చెప్పుకొచ్చాడు.