'చెలియా' సినిమాతో నిన్నమొన్నటి వరకు అజ్ఞాతంలోకి వెళ్లిన మణిరత్నం ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని... అది కూడా రామ్ చరణ్ తో సినిమాని తెరకెక్కించాలనుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం మణి ట్రాక్ రికార్డు చూసి వెనక్కి తగ్గి తన తదుపరి సినిమాలను వరుసగా లైన్ లో పెట్టేశాడు. అయితే మణిరత్నం ఇక స్టార్ హీరో కన్నా ఒక మల్టీస్టారర్ సినిమా చేసి మళ్ళీ తానేమిటో నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యిందే తడవుగా మంచి కథతో పాటు నటీనటులను కూడా ఎంపిక చేసి సినిమాని మొదలుపెట్టేశాడు.
ఇక మణిరత్నం మల్టీస్టారర్ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఎనౌన్స్ చేశాడు. 'చెక్కా చివంత వానం’ టైటిల్ తో ఈ మల్టీస్టారర్ ఉండబోతుందని మణిరత్నం ఒక ట్వీట్ చేశాడు. కేవలం టైటిల్ మాత్రమే కాకూండా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశాడు. మరి 'చెక్కా చివంత వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ సినిమాలో నటిస్తున్న అరవింద్ స్వామి, సిలంబరసన్, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి మొహాలను కనిపించి కనిపించకుండా డిజైన్ చేసి అందరిలో ఆసక్తిని పెంచేశాడు.
ఇక ఈ సినిమాని మణిరత్నం సొంత సంస్థ అయిన మద్రాసు టాకీస్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జ్యోతిక, జయసుధ, ప్రకాష్ రాజ్, త్యాగరాజన్, అదితిరావ్ హైదరి, మోడల్ దయానా ఎర్రప్ప, నటిస్తుండగా.. తమిళంలో ‘చెక్కా చివంత వానం’ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ తెలుగులో ‘నవాబ్’ టైటిల్ తో రాబోతుంది.