మొదటిసారి తమ బ్యానర్ లో కోలుకోలేని దెబ్బతిన్నాడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు. అజ్ఞాతవాసి సినిమాని పరిమితికి మించి బడ్జెట్ ని పెట్టేసి త్రివిక్రమ్ మీద నమ్మకంతో కోట్లు వెనకేసుకుందామనుకున్నాడు. కానీ చినబాబు ఆశలు మీద అజ్ఞాతవాసి నీళ్లు చల్లేసింది. ఆ సినిమా డిజాస్టర్ తో బయ్యర్లు రోడ్డున పడ్డారు. కానీ ఎక్కడా అజ్ఞాతవాసి నిర్మాతని గాని, త్రివిక్రమ్ ని గాని ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలంటూ వెళ్ళిపోయాడు. అయితే బయ్యర్లకు లాస్ వచ్చినప్పుడు నిర్మాతలు, హీరోలు, దర్శకులు తాము తీసుకున్న మొత్తం నుండి ఎంతో కొంత వెనక్కి ఇచ్చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఎక్కడా స్పష్టత లేదు.
ఇప్పుడు కూడా అజ్ఞాతవాసి విషయంలో నిర్మాత బయ్యర్లకు కొంత మొత్తం అంటే నష్టాల్లో 20 శాతం వెనక్కి ఇచ్చేసినట్లుగా వార్తలొస్తున్నాయి కానీ ఇక్కడా క్లారిటీ లేదు. కానీ చినబాబు మాత్రం అజ్ఞాతవాసి బయ్యర్లను ఆదుకుంటున్నాడని.. ఇప్పటికే కొంతమందికి లెక్కలు సెటిల్ చెయ్యడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారట. ఎంత వెనక్కి ఇస్తే తాము సేఫ్ లో ఉంటామనే విషయాన్ని కూడా చినబాబు ఆలోచిస్తున్నారట. ముందుగా అకౌంట్ వేసుకుని ఆ తర్వాత వన్ బై వన్ అందరికి సెటిల్ చేయడమా లేదా వారి దగ్గర నుండి తర్వాత సినిమాలకు అడ్వాన్సులుగా వుంచడమా అనేది చూస్తారట.
అయితే ఇప్పటికే నైజాం నుండి దిల్ రాజుకి నష్టాలను హారిక హాసిని వారు సెటిల్ చేసినట్లుగా తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా అజ్ఞాతవాసితో నష్టపోయిన దిల్ రాజుకి 7 కోట్లు సెటిల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. దిల్ రాజు అజ్ఞాతవాసి నష్టాన్ని దాదాపుగా 14 కోట్లు చూపిస్తే.. దానికి చినబాబు 7కోట్లు ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి అజ్ఞాతవాసితో చినబాబు నష్టపోవడం అలా ఉంచితే అందరి దృష్టిలో అంటే బయ్యర్ల దృష్టిలో దేవుడిగానే కనబడుతున్నాడు.