నయనతార.. ఈమె కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ అనే చెప్పాలి. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఆమెతో నటించడానికి ఇప్పటికీ కూడా కొత్త హీరోలు, యంగ్ జనరేషన్ హీరోలతో పాటు స్టార్స్ కూడా ఆసక్తి చూపుతుంటారు. ఇక తాజాగా ఆమె అజిత్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఓ కొత్త దర్శకునితో ఓ హర్రర్ కథాంశానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు అన్ని రకాల పాత్రలలో ఆమె మెప్పిస్తోంది. ఇటీవల ఆమె స్టార్ హీరోలకు కూడా అసభ్యరకమైన డ్యాన్స్‌లు, స్టెప్స్, కాస్టూమ్స్‌కి కూడా నో చెబుతోంది. ఇటీవల 'జైసింహా'లో కూడా కనీసం ఆమె చిటికెన వేలుని కూడా బాలయ్య తాకే సీన్స్ లేకపోవడం గమనార్హం.
దీంతో ఆమె పెళ్లి నిశ్చయమైందని, దాంతోనే ఆమె ఇలాంటి సన్నివేశాలకు నో చెబుతోందని కోలీవుడ్ మీడియా అంటోంది. గతంలో శింబు, ప్రభుదేవాలతో ఆమె ప్రేమాయణం నడిపింది. అవి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. స్వతహాగా క్రిస్టియన్ అయిన ఆమె ఆ తర్వాత హిందు మతం పుచ్చుకుంది. ప్రస్తుతం ఆమె 'గ్యాంగ్' దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వస్తున్నాయి. మరికొందరైతే వీరిద్దరికి కొచ్చిలో రహస్యంగా వివాహం కూడా జరిగిందని, ఇద్దరు కలసి ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం కూడా పెట్టారని అంటున్నారు.
కానీ మరికొందరు మాత్రం వారిద్దరు ఇంకా వివాహం చేసుకోలేదు. త్వరలో వివాహం చేసుకుని కొత్తగా కాపురం పెట్టనున్నారని అంటున్నారు. కానీ ఆమె చేతిలో ఇప్పుడు ఊ అంటే కనీసం డజను చిత్రాలు క్యూలో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇంత బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినీ కెరీర్‌కి స్టాప్ పెడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.