ఎలాంటి సినీ నేపధ్యం లేని కుటుంబం నుంచి వచ్చి తుళు మాతృభాషగా కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన హీరో సుమన్ ఒకానొక సమయంలో చిరంజీవికి సైతం హీరోగా పోటీ ఇచ్చాడు. మధ్యలో బ్లూఫిల్మ్ కేసులో ఇరుక్కుని నాన్‌బెయిలబుల్ వారెంట్ గూండాయాక్ట్ కింద జైలుకి వెళ్లి జైలు జీవితం గడిపాడు. దాంతో ఆయన కెరీర్ నాశనం అయింది. ఆ తర్వాత ఆయన నిర్దోషిగా బయటపడినా కూడా ఆయన కోల్పోయిన జీవితాన్ని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేకపోయారు. ఇక ఆయన ఎలాంటి సినిమా నేపధ్యం లేకపోయినా 40ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో సాగుతూ, యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, 'అన్నమయ్య, శ్రీరామదాసు; శ్రీసత్యన్నారాయణస్వామి' వంటి చిత్రాలలో దేవుళ్ల పాత్రలో సైతం మెప్పించారు. 'అన్నమయ్య'లో ఆయన వేంకటేశ్వరస్వామిగా మెప్పించే వరకు ఆయన పౌరాణిక పాత్రలకు కూడా బాగా సరిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత సుమనే అన్నారు.
ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ యాక్టర్‌గా కూడా మెప్పిస్తూ 500లకు పైగా చిత్రాలలో, దాదాపు తొమ్మిది భాషల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఆయన 'శివాజీ' చిత్రంలో రజనీకాంత్‌కి థీటైన విలన్‌గా కూడా మెప్పించాడు. ఇక తన జైలు జీవితం సందర్భంగా తనకు జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చిందని, నిజమైన ఆప్తులు ఎవరు? అనేది తెలుసుకుని శారీరకంగా, మానసికంగా మరింత పటిష్టంగా తయారయ్యానని అంటున్నాడు.
పరిస్థితులే తనకు వాటిని ఎదుర్కోవడం నేర్పాయని, సర్కిల్ మెయిన్ టెయిన్ చేయడం వల్ల అవకాశాలు ఎక్కువగా వస్తాయని అందరూ అంటూ ఉంటారని, మొదట్లో కూడా తాను ఈ విషయం నమ్మేవాడినని, కానీ దురదృష్టం వెంటాడుతున్నప్పుడు సిర్కిల్స్ కాపాడలేవని, కాలం కలిసి రానప్పుడు ఏ సర్కిల్ కూడా టచ్‌లోకి రాదని తెలిసి వచ్చిందని, తనను ఓ సూపర్ నేచురల్ పవర్ నడిపిస్తున్నట్లు తాను నమ్ముతానని చెప్పుకొచ్చాడు. మొత్తంగా కెరీర్‌తోపాటు నిజజీవితంలో కూడా ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్న సుమన్ జీవితం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.