జీవితంలో గానీ కెరీర్‌లో గానీ ఎదగాలంటే ప్రతి ఒక్కరికి వారి బలాలు, బలహీనతలు తెలిసి ఉండాలని అక్కినేని నాగేశ్వరరావు బతికున్నప్పుడు చెబుతూ ఉండేవాడు. ఆయనకు అలా తన ఒడ్డు పొడవు, తన గొంతు, తన పర్సనాలిటీ, వాయిస్ వంటి వాటిపై సరైన జడ్జిమెంట్ ఉన్నందునే ఎదురుగా ఆజానుబాహుడు, కంచుకఠం కలిగిన ఎన్టీఆర్ వంటి నటుడు ఉన్నప్పటికీ అక్కినేని తనకు మాత్రమే సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్‌ని సాగించాడు. ఈ కాలంలో కూడా తమ బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలిసిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో స్వీటీ అనుష్క గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈ మధ్య నిన్నగాక మొన్న మలయాళం నుంచి ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు తామే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటూ వస్త్తున్నారు.
కానీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు దాటి పదిహేనేళ్లకు చేరువ అవుతున్నా గానీ అనుష్క ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. కారణం గురించి ఆమె చెబుతూ, నా నటన వేరు. నా వ్యక్తిత్వం వేరు. నేను లేడీ ఓరియంటెడ్‌గా చేస్తున్న పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటున్నాయి. నాటి 'అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి నుంచి నేటి భాగమతి' వరకు నేను చేసిన పాత్రలు ఎంతో పవర్‌పుల్. కానీ నిజజీవితంలో నేను మాట్లాడితే చిన్నపిల్లలా గొంతు ఉంటుంది. కొన్నిసార్లు నేను మాట్లాడే మాటలు నా పక్కవారికి కూడా వినిపించవు. ఈ విషయమే మా ఇంట్లో వారు కూడా నాకు చెబుతూ ఉంటారు. అందువల్ల నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకొని నా పాత్ర ప్రభావాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఉదాహరణకు 'అరుంధతి' చిత్రంలోని 'నువ్వు నన్నేమి చేయలేవురా' ఆనే డైలాగ్‌కి గొంతే ప్రాణం. నాకా విషయం తెలుసు.
ఇక 'భాగమతి'లోని 'ఇది భాగమతి అడ్డా' అనే డైలాగ్ కూడా ఎంతో కీలకమైంది. అలాంటి భీకరమైన డైలాగ్స్‌కి నా గొంతు సెట్ కాదు. అందుకే నేను డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేయలేదు అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటివరకు యూఎస్‌లో మహిళా ప్రాధాన్యం ఉండే చిత్రాలలో శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం ఎక్కువ కలెక్షన్లు సాధించింది. తర్వాత స్థానంలో 'భాగమతి' ఉంది. ఆ రికార్డును ఫుల్‌రన్‌లో అనుష్క అధిగమిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.