అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ, దేవరకొండ విజయ్ అంటే అర్జున్ రెడ్డి అన్నట్టుగా తయారైంది విజయ్ దేవరకొండ వ్యవహారం. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి స్టయిల్లోకి మారిపోవడమే కాదు క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అరడజను సినిమాలు చేతిలో పెట్టుకున్న విజయ్ వెంట నిర్మాతలు పడడం మాత్రం మానడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను వూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ పై పెట్టుబడి పెట్టడానికి చాలామంది నిర్మాతలు రెడీగా వున్నారు.
దర్శకనిర్మాతలు విజయ్ తో సినిమా చెయ్యాలని ఉత్సాహం చూపడమే కాదు.. విజయ్ దేవరకొండకి భారీ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. బడా నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అంటే... అతని రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. మరి విజయ్ దేవరకొండకు మైత్రి మూవీస్ వారు ఏకంగా 2.5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా జూన్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కేవలం విజయ్ దేవరకొండకి అడ్వాన్స్ ఇవ్వడమే కాదు.... ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇకపోతే రష్మిక మందన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన పరశురామ్ డైరెక్షన్ లో నటిస్తుంది. మళ్ళీ ఈ హీరోయిన్ ని మైత్రి వారు కూడా విజయ్ దేవరకొండ కోసం తీసుకురావడం అంటే... ఆ హీరోయిన్ పై వారికెంతగా గురి ఉందో.