స్టార్ హీరోల సినిమాలు మొదలైనప్పటి నుండే ఇండస్ట్రీతోపాటే సగటు పేక్షకుల చూపు ఆ సినిమాపై పడుతుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే సరేసరి. ఆ సినిమాని ఎంత తక్కువకు కొట్టేద్దామా అని కాచుకుని కూర్చుంటారు. కానీ స్టార్ హీరోల సినిమా నిర్మాతలు మాత్రం ఎంత ఎక్కువ బిజినెస్ చేసి సినిమాని బయ్యర్లకు అమ్మేద్దామా అని అనుకుంటారు. అయితే బయ్యర్లు కూడా స్టార్ హీరోలకున్న క్రేజ్ ని బట్టి ఆయా సినిమాలను భారీ ధరలు వెచ్చించి హక్కులను సొంతం చేసుకుంటారు. మరి ఆ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అయితే బయ్యర్లకు లాభాలు పంట..... లేదంటే బయ్యర్లు రోడ్డున పడే పరిస్థితి.
అయితే బయ్యర్లు నష్టపోతే గనక ఆ సినిమాల నిర్మాతలును, హీరోలను ఎంతో కొంత మొత్తం వెనక్కి ఇవ్వమని డిమాండ్ చెయ్యడం అనేది ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఆ మధ్యన స్పైడర్ విషయంలో ఇలా జరిగితే... ఈమధ్యన అజ్ఞాతవాసి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి తలనొప్పులు రాకుండా రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. అదేమిటంటే మార్కెట్ లో సినిమాకి వున్న హైప్ ఆధారంగా .. అభిమానుల్లో వున్న క్రేజ్ కారణంగా... అధిక ధరకు తన సినిమా రంగస్థలం ఏరియా హక్కులను నిర్ణయించవద్దని నిర్మాతలకు చెప్పేశాడట.
ఎవరికీ ఎలాంటి నష్టం కలగని విధంగా రంగస్థలం హక్కులని 20 శాతం తక్కువకే ఇచ్చేయమని చరణ్ చెప్పాడట. అలాగే నిర్మాతలు హక్కులను ఏయే ఏరియాలలో ఎవరికి ఎంతకి అమ్మారనే వివరాలను డీల్ క్లోజ్ చేయడానికి ముందే.. తనకి చెప్పాలని చరణ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి చరణ్ ఇలా చెప్పడం ఒక కొత్త పరిణామమే. ఎందుకంటే చరణ్ ఇలా చేసి ఒక కొత్తవరవడికి నాంది పలికినట్లేగా..