జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కమల్‌హాసన్ 'విశ్వరూపం' విషయంలోనే కాదు... విజయ్ నటించిన 'అన్న' చిత్రం విడుదలలో కూడా పలు విధాలుగా ఆమె ఆయన్ని ఇబ్బంది పెట్టింది. దీంతో కిందటి ఎన్నికల్లో విజయ్ అనఫీషియల్‌గా బిజెపికి సపోర్ట్ చేశాడు. ఆయన అభిమానులు బిజెపికి ఓట్లేయమని చెబుతూ, ఫ్లెక్సీలు, కటౌట్ల ద్వారా ప్రచారం చేశారు. నాడు విజయ్ బిజెపి నేతలతో మంతనాలు కూడా జరిపాడు. ఇక జయ మరణం తర్వాత ఏర్పడిన శూన్యతను క్యాష్ చేసుకోవాలని ఆల్‌రెడీ రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడు తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 234 స్థానాలలోనూ పోటీ చేస్తామని రజనీకాంత్ ప్రకటించాడు.
ఇక కమల్‌హాసన్ ఈనెల 21న తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించి బహిరంగసభ ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నాడు. ఇక రజనీ, కమల్‌లతో పాటు విశాల్ సైతం ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురైంది, వచ్చే ఎన్నికల్లో తన మద్దతు రజనీకేనని విశాల్, సుందర్‌సి, రాఘవలారెన్స్ వంటి వారు బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రజనీకి ధనుష్ మద్దతు కూడా ఉంటుంది. ఇక కె.భాగ్యరాజా, టి.రాజేందర్, కార్తీక్, ప్రభులు కూడా రాజకీయాలలోకి వస్తామని చెబుతున్నారు. ఆల్‌రెడీ విజయ్‌కాంత్, శరత్‌కుమార్‌లు రాజకీయాలలోనే ఉన్నారు.
ఇక ఇప్పుడు తమిళనాట రజనీ తర్వాత సెకండ్ ప్లేస్‌కి అజిత్‌తో కలిసి పోటీపడుతున్న విజయ్ రాజకీయాలలోకి రావడం కూడా గ్యారంటీ అంటున్నారు. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ తన కుమారుడు రాజకీయాలలోకి రావాలని ఇప్పటికే కోరుకుంటున్నానని ప్రకటన చేశాడు. విజయ్‌కి తెలియకుండా ఈ ప్రకటన చేసే అవకాశం లేదు. విజయ్ కూడా తానెప్పుడు రాజకీయాలలోకి రానని చెప్పలేదు. ఆయనకు రాజకీయాలపై ఇంట్రస్ట్ ఉందని ఇప్పటికే స్పష్టమైంది. 'మెర్సల్' చిత్రంతో డాక్టర్ల అవినీతిని, కేంద్రంలోని బిజెపి పెద్దలను టార్గెట్ చేసిన విజయ్ తదుపరి చిత్రం కూడా మురుగదాస్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందనుందని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రజనీ, కమల్ అభిమానులు తమ హీరోల తరపున వెబ్‌సైట్లను ప్రారంభించి, ప్రజలను పార్టీలో చేర్చుకుంటూ సభ్యత్వాల నమోదులో ఉన్నారు. తాజాగా విజయ్ అభిమానులు కూడా ఈ పనికి సిద్దమయ్యారు. గతంలోనే విజయ్ తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తమ హీరో ఎప్పుడైనా రాజకీయాలలోకి రావచ్చని, కాబట్టే ప్రజలకు సభ్యత్వం ఇస్తున్నామని విజయ్ అభిమానులు అంటున్నారు. తమ హీరో అనుమతి లేకుండా వారు అలాంటి పనులు చేయరు. కాబట్టి విజయ్ రాజకీయప్రవేశం కూడా ఖాయమని, ఇక రాజకీయాలలోకి రానని చెప్పిన ఒకే స్టార్‌గా అజిత్‌నే చెపాల్సివుంటుంది.