రాజైనా, నాయకుడైనా, సినీ నటులైనా ప్రేక్షకులు, ప్రజలు ఆదరించినంత కాలమే. అదే అభిమానులను, ప్రేక్షకులను, ప్రజలను ఇబ్బంది పెట్టినా, ఏదైనా ఎక్స్‌ట్రాలు చేసినా వారికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ కొద్దిరోజుల్లోనే మాయం అవుతుంది. ఎంత టాలెంట్ ఉన్న ఆదరించే వారు లేకపోతే ఏమి జరుగుతుందో మహామహులైన వారి గత జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. సెలబ్రిటీ హోదా ప్రజలు ఇస్తే వచ్చేదే గానీ తమంతట తాము కోరుకుంటే వచ్చేది కాదు. ఆ మాత్రం సహనం, ఓర్పు లేని వారు సెలబ్రిటీలుగా ఉండటానికి అనర్హులు.
గత కొంతకాలంగా అనసూయ ప్రవర్తన, ఆమె మాటలు, ఆమె వస్త్రధారణ వంటివి పలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఏదో యువకులు, ఊహ తెలిసిన వారు తప్పుగా ప్రవర్తిస్తేనో లేక మహిళలు అని చూడకుండా వారికి ఇబ్బంది కలిగిస్తేనో, తీయరాని చోట, తీయకూడని విధంగా ఫొటోలు తీస్తేనే కోపం తెచ్చుకోవడంలో కాస్తైనా అర్ధముంది. కానీ ఓ చిన్న బాలుడు అనసూయ కనిపిస్తే సెల్ఫీ అడిగిన వెంటనే కోపంతో ఫోన్‌ని నేలపైకి విసిరికొట్టిన ఘటన మాత్రం అనసూయలోని అహంభావానికి ప్రతీకగా నిలుస్తోంది.
తన బిజీ, తన హడావుడి, తన టెన్షన్ తనకి ఉండవచ్చు. అంత మాత్రాన పిల్లాడని కూడా చూడకుండా తార్నాక వద్ద చిన్న పిల్లాడు, ఆమె తల్లిపట్ల అనసూయ ప్రవర్తించిన తీరుని నెటిజన్లు కూడా బాగా తప్పు పడుతున్నారు. చిన్నపిల్లాడు అడిగాడు కాబట్టి ఇష్టం లేకపోతే అదే చెప్పి తిరస్కరించవచ్చు. లేదా ఇప్పుడు కుదరదని చెప్పాలి. అంతేగానీ ఫోన్‌ని నేలకేసి కొట్టడంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఆ బాలుడి తల్లి ఫిర్యాదు ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే అనసూయ మాత్రం తన ప్రైవసీకి భంగం కలిగించవద్దని, ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రజలు తనపై అభాండాలు వేస్తున్నారని మండిపడుతూ ట్వీట్ పెట్టింది. కానీ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ట్వీట్‌ని ఆమెతొలగించింది. మొత్తానికి ఈ విషయంలో అనసూయ తప్పే ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.