తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నవాళ్లలో నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దుమకృష్ణమనాయుడు, ఉపేంద్ర వంటి వారు ముఖ్యులు. ఇప్పటికే నల్లపురెడ్డి, ఉపేంద్ర మరణించగా తాజాగా గాలి ముద్దుమకృష్ణనాయుడు కూడా మరణించడంతో టిడిపీ పార్టీ మరో సీనియర్ నేతను పోగొట్టుకున్నట్లు అయింది.
గాలి ముద్దుమకృష్ణనాయుడు ఆరు సార్లు చిత్తూరులోని పుత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నో పదవులను, మంత్రి పదవిని సైతం సమర్ధవంతంగా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఆయన నగరి నుంచి పోటీ చేసి సినీ నటి, వైసీపీ మహిళానేత రోజా చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన 1947 జూన్ 9వ తేదీన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం, వెంకట్రామపురంలో గాలి రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. విద్యాబ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిని చేపట్టారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి పలు సేవలు అందించారు. కాంగ్రెస్‌ని తన విమర్శలతో చీల్చిచెండాడడంలో ఈయన ముందుండేవాడు. చిత్తూరు జిల్లాలో గాలి ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు సీనియర్స్‌గా చెలామణి అయ్యేవారు. పార్టీలో ఎన్టీఆర్‌కి తర్వాత చంద్రబాబు నాయుడుకి కూడా గాలి ముద్దుకృష్ణమనాయుడు కుడి భుజంగా ఉండేవాడు.
ముఖ్యంగా చంద్రబాబు కూడా చిత్తూరు జిల్లా వాసి కావడంతో ఆయన నియోజకవర్గమైన కుప్పం అభివృద్ది పనులను, కార్యకర్తలను కూడా ముద్దు కృష్ణమనాయుడే స్వయంగా పర్యవేక్షించేవారు. ఈయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారంతో 71 ఏళ్ల వయసులో కూడా ఈయన తన గళం వినిపిస్తూనే ఉన్నారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, మరణించారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.
ముద్దుకృష్ణమనాయడు మృతి పట్ల చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుతో పాటు లోకేష్‌తో సహా టిడిపి ముఖ్యనాయకులందరూ హాజరుకానున్నారు.