తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్‌ది ప్రత్యేక స్థానం. ఈటీవీలో ప్రసారమైన నాటి 'చదరంగం' సీరియల్ నుంచి 'సంబరం'లో చిన్న పాత్ర చేసి 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'యువత'తో పాటు కొన్ని చిత్రాలు చేసినా 'స్వామిరారా' నుంచి తనదైన విభిన్న కథలు, పాత్రలతో దూసుకెళ్తున్నాడు. 'కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలతో 20 కోట్ల మార్కెట్‌ని అందుకున్నాడు. 'కేశవ' వంటి డివైట్ టాక్ వచ్చిన సినిమా కూడా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిందంటే యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అర్ధమవుతుంది.
ప్రస్తుతం కన్నడ బ్లాక్‌బస్టర్ 'కిర్రాక్‌పార్టీ'తో మరోసారి కాలేజీ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత తమిళ సూపర్‌హిట్ మూవీ 'కణితన్'ని రీమేక్ చేయనున్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ, నేను ఇటీవలే షూటింగ్ సందర్భంగా ఏపీ అంతా తిరిగి వచ్చాను. ఏపీ చాలా వెనకబడి ఉంది. ఏపీ అభివృద్ది చెందాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. అలా నిధులు రావాలన్నా, కేంద్రం సాయం చేయాలన్నా ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఇవ్వాలి. ఓ తెలుగువాడిగా, భారతీయునిగా రాష్ట్రాభివృద్దిని నేను కోరుకుంటున్నాను. కొందరు నీవు నటుడివి నీకెందుకు ఇవ్వన్నీ అంటున్నారు.
కానీ స్పందించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది అని ట్వీట్ చేశాడు. ఎక్కడ ఏపీని వెనకేసుకొస్తే తెలంగాణలో చెడ్డపేరు వస్తుందోనని మహామహులు, ఏపీ నుంచి ఎంతో లబ్ది పొందిన వారు కూడా మౌనంగా ఉంటే హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నిఖిల్ ఇంత డేర్‌గా స్పందించడం చూస్తే ఈయన కూడా పవన్, శివాజీలలాగా ఈ విషయంలో తన వంతు కృషిని చేస్తాడేమో చూడాలి.