నిన్నటితరం హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో పాటు పోటీపడిన వారిలో సుమన్, భానుచందర్‌లను చెప్పుకోవచ్చు. ఇక భానుచందర్ విషయానికి వస్తే ఆయన హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 'ముక్కుపుడక, మెరుపుదాడి, నిరీక్షణ' వంటి చిత్రాలలో ఆయన నటనను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'నిరీక్షణ' అయితే ఓ క్లాసిక్ మూవీ కిందకు వస్తుంది. తెలుగులో వచ్చిన అద్భుత చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక భానుచందర్ ముక్కుసూటి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. డ్రగ్స్ కేసు సమయంలో తాను ఒకప్పుడు డ్రగ్స్‌కి ఎడిక్ట్‌నేనని, మార్షల్ ఆర్ట్స్ ద్వారా బయటకి వచ్చానని చెప్పి తన గట్స్ నిరూపించుకున్నాడు.
ఇక ఈయన నిర్మాత, దర్శకుడు కూడా. ఈయన మన దక్షిణాది చిత్రాల విషయం గురించి మాట్లాడుతూ, దక్షిణాదిలో మలయాళంలో మంచి చిత్రాలు వస్తాయి. తర్వాత కోలీవుడ్‌లో అలాంటి చిత్రాలు బాగానే ఉంటాయి. కన్నడ నాట వారి బడ్జెట్, సినారియో వేరు. కానీ చిట్టచివరన ఉండేది మాత్రం తెలుగు సినిమానే. తెలుగులో హీరో రిక్షావాడయినా, బిచ్చగాడైనా, రాజకీయ నాయకుడైన, కలెక్టర్ అయినా సరే డ్యాన్స్, పైట్స్, నవ్వు, ఏడుపు అన్ని ఉండాల్సిందే. అందుకే తెలుగులో మంచి చిత్రాలు రావడం లేదు.
ఇక 'బాహుబలి' చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉందని ఏ హాలీవుడ్ దర్శకుడు, టెక్నీషియన్ చెప్పారు? 'బాహుబలి' గ్రేట్ ఎంటర్‌టైనర్, మోస్ట్ పాపులర్ మూవీ అని మాత్రమే చెప్పవచ్చు ఈ చిత్రంతో తెలుగు సినిమా ప్రమోషన్స్ స్థాయిని రాజమౌళి హైలెవల్‌కి తీసుకెళ్లాడు. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. కానీ పాపులర్ చిత్రం వేరు.. మంచి చిత్రం వేరు. పాపులర్ చిత్రం అంటే 'బాహుబలి', మంచి చిత్రం అంటే 'దంగల్'. పాపులర్ చిత్రాలన్ని మంచి చిత్రాలు కాలేవంటూ తనదైనశైలిలో విశ్లేషించారు.