గతంలో దివిసీమ ఉప్పెన వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి నటీనటులు రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో స్టేజీషోలు, మ్యూజికల్ షోలు వేసి విరాళాలు సేకరించారు. కానీ నాడు కృష్ణ తన సొంత సంపాదనలోని పెద్ద మొత్తాన్ని దివిసీమ ఉప్పెన బాధితులకు విరాళం ఇచ్చాడు. ఇక నాడు ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో పోటీగా విఠలాచార్య దర్శకత్వంలో నరసింహరాజు చేసిన చిత్రాలు ఆయనకు స్టార్‌డమ్‌ని తెచ్చాయి. ఆయన వద్దకు ఓ జర్నలిస్ట్ వెళ్లి మీరు కూడా సినిమా వారితో కలిసి స్టేజీషోలు ఇవ్వడానికి ఎందుకు వెళ్లలేదు? అని ప్రశ్నించాడు. దానికి నరసింహారాజు ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. మనమేమైనా పేదవారిమా? మన వద్ద కావాల్సినంత సంపద ఉంది. మొదట మన వంతుగా కొంత పెద్ద మొత్తం ఇచ్చి, తర్వాత ప్రజలను విరాళాలు అడగాలి. ఏం.. ఓ సినిమా రెమ్యూనరేషన్‌ని ఈ పెద్దలు ఎందుకు విరాళం ఇవ్వలేదు అని ప్రశ్నించి తదుపరి నేను నటించే రెండు చిత్రాల పూర్తి పారితోషికం విరాళంగా ఇస్తున్నానని ప్రకటించడం, దాని వల్ల ఎన్టీఆర్, ఏయన్నార్‌లు నరసింహారాజుపై కక్ష్య తీర్చుకున్నారని నాటి జర్నలిస్ట్‌లు చెబుతారు.
ఇదే సూత్రం మంచు లక్ష్మికి కూడా వర్తిస్తుందనే చెప్పాలి. మంచు ఫ్యామిలీ హీరోలు ఎన్ని చిత్రాలు ఫ్లాప్ అయినా లెక్కపెట్టకుండా వరుసగా చిత్రాలు తీస్తున్నారంటే వారి ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అర్ధమవుతోంది. కానీ మంచులక్ష్మి మాత్రం 'మేము సైతం' అని సినీ సెలబ్రిటీల చేత కూరగాయలు, ఆటోలు నడిపిస్తూ, వచ్చిన విరాళాలను పేదవారికి ఇస్తామని చెబుతోంది. ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినా ముందుగా తన వంతు సాయం ప్రకటించి తర్వాత ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు గానీ ప్రజల నుంచే వసూలు చేసి ప్రజలకే ఇవ్వడంలో గొప్ప ఏమీ లేదు. అయినా ఇలాంటివి ప్రజల్లో కాస్త సామాజిక స్పృహను కలిగిస్తాయనేది మాత్రం వాస్తవం.
ఇక తాజాగా అనుష్క 'మేముసైతం' కోసం మంచు లక్ష్మి అడిగిన వెంటనే ఫిల్మ్‌నగర్‌లోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ బంక్ యూనిఫాం, క్యాప్ ధరించి ఉత్సాహంగా పెట్రోలుని పట్టింది. ఇక 'మేముసైతం' రెండో సీజన్ త్వరలో జెమిని టీవీలో ప్రసారానికి సమాయత్తమవుతోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేయకుండా పది మందికి ఆదర్శంగా నిలబడాలంటే ముందు పెద్దలు తమ జేబుల్లోంచి ఇవ్వాల్సిందేననేది మాత్రం వాస్తవం.