ఈ మధ్యన బ్రహ్మానందం 'జైసింహా' సినిమాతో వెలుగులోకి వచ్చాడు. అసలు గతంలో బ్రహ్మి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు 30 ఏళ్ళు పాటు బ్రహ్మానందం తెలుగు సినిమాల్లో హాస్యాన్ని పండించాడు. 'అహనా పెళ్ళంట' లో బ్రహ్మి కామెడీకి పొట్ట చెక్కలయ్యే నవ్వులు థియేటర్స్ లో వినబడ్డాయి. బ్రహ్మానందం కామెడీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పడం కూడా కష్టమే. అలాంటి బ్రహ్మి హావా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఈ మధ్యన బ్రహ్మానందం కామెడీ అంటేనే వెగటు పుడుతుందా అనే లెవల్ కి బ్రహ్మి కామెడీ పడిపోయింది.
ప్రస్తుతం ఒకటి అరా సినిమాల్లో నటిస్తున్న బ్రహ్మి ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తాను గత సినిమాల కామెడీ విషయాలను నలుగురితో పంచుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో దర్శకుడు జంధ్యాల డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలోనూ బ్రహ్మి తన హాస్యాన్ని పండించాడు. అయితే అప్పట్లో 'వివాహ భోజనంబు’ అనే సినిమాలో సుత్తి వీరభద్రరావు - బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ఇప్పటికి హైలెట్టే. ఆ సీన్ లో బ్రహ్మానందంని ఇసుకలో పూడ్చి పెట్టి హైదరాబాదు.. సికింద్రాబాదు.. ఆదిలాబాదు.. అంటూ సుత్తి వాయించేసే సీన్ సూపర్ గా అంటే కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది.
అయితే అంత అద్భుతమైన సీన్ చేసేటప్పుడు బ్రహ్మికి చుక్కలు కనబడినాయట. అసలు అలాంటి ఇసుకలో పూడ్చిపెట్టి తీసే సీన్స్ లో నిజంగా ఆర్టిస్టును పాతి పెట్టకుండా చెక్క పెట్టెలో నిలబెట్టి చుట్టూ మట్టి పేరుస్తుంటారని.. కానీ ఆ రోజు మాత్రం అలాంటి ఏర్పాట్లేమీ చేయకుండా నిజంగానే తనను ఇసుకలో గొంతు వరకు పూడ్చి పెట్టారని..... ఆ సమయానికే అటుగా ఓ కుక్క వస్తే.. దాన్ని చూసిన జంధ్యాల గారు అప్పటికప్పుడు ‘ఏ ఊర కుక్కయినా దగ్గరికొచ్చి కాలెత్తితే జన్మ పావనమైపోతుంది మహాప్రభో’ అనే డైలాగ్ రాసినట్లు చెప్పిన బ్రహ్మి ఆ సీన్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పాడు. అందులోను ఆ ఇసుక సన్నివేశాన్ని మిట్ట మధ్యాహ్నం ఎండలో తీసారని.... దురద పెట్టుకున్నా గోక్కోలేక ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు బ్రహ్మి.