ప్రస్తుతానికి బాలకృష్ణ భుజానికి గాయమై శాస్త్ర చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ గాయానికి ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కొద్దిగా విశ్రాంతి తీసుకుని ఎప్పటిలాగే షూటింగ్ కి జాయిన్ అవ్వవచ్చని చెప్పడమే తడువు బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ గురించి ఆలోచించడం మొదలెట్టేశాడు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం భారీ బడ్జెట్ నే ఎక్కిస్తున్నారు బాలయ్య, సాయి కొర్రపాటి బ్యాచ్.
వచ్చే మార్చ్ నుండి ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ అవుతుందని... దాదాపుగా 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర బృందం హాలీవుడ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారట. హాలీవుడ్ నుండి వచ్చిన టీం బాలయ్య ఈ చిత్రంలో వెయ్యబోయే 22 గెటప్స్ కి సంబంధించి స్కెచ్ లు రూపొందిస్తున్నారని అంటున్నారు. అలాగే ఓవర్సీస్ బృందం కూడా ఎన్టీఆర్ తెలిసిన 125 మంది నుండి కొంతమేర సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది.
ఇక మార్చ్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టి అక్కడ నుండి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకి సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ చిన్నప్పటి, యువకుని, మధ్య వయస్కుని పాత్రలను వేర్వేరు నటులు, సీనియర్ రోల్ ని బాలయ్యే పోషిస్తాడని ఈ చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక బాలయ్య వెయ్యబోయే 22 గెటప్స్ లో... ఎలా వుండబోతున్నాడో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిలో వుంది.