రోజు రోజుకూ నేషనల్ స్టార్‌గా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయంలో అందరూ విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రభాస్, అనుష్కని వివాహం చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. అందరు ఎన్ని వివరణలు ఇచ్చినా ఇవి ఆగడం లేదు. 'భాగమతి'లో అనుష్క నటించడానికి ప్రభాసే కారణమని, 'భాగమతి' తర్వాత అనుష్క మరో సినిమాకి ఓకే చేయకపోవడం వెనుక కూడా ప్రభాస్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. 'మిర్చి, బాహుబలి'లో వారి కెమిస్ట్రీని చూసిన ప్రభాస్ అభిమానులు కూడా అదే నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఓ అభిమాని అనుష్కని ప్రభాస్‌ని వివాహం చేసుకోకూడదా? అని ప్రశ్నిస్తే నా జీవిత విషయాలపై కూడా ఇంతటి ఆసక్తిని చూపుతున్నందుకు థ్యాంక్స్ అంటూ కాస్త వెరైటీగా స్పందించింది. మరోవైపు 'బాహుబలి' తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' తర్వాత చేసుకుంటానని అంటున్నాడని, ఆయన పెళ్లి విషయంలో కాస్త మెత్తబడ్డాడని ఆయన పెదనాన్న కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు.
ఇక విషయానికి వస్తే దక్షిణాదిలో ఒక్క సినిమా విడుదల కాకుండానే అందరి నోటా నానుతోన్న హీరోయిన్ శ్రద్దాకపూర్. ఈమెకి ఇంతగా పాపులారిటీ రావడానికి కారణం నేషనల్ స్టార్ అయిన ప్రభాస్‌తో 'సాహో' చిత్రంలో నటిస్తుండటమే. కాగా ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందని కొందరు.. రెండు షేడ్స్ ఉండే పాత్రను చేస్తోందని మరికొందరు అంటున్నారు.
ఇక తాజాగా శ్రద్దాకపూర్ మాట్లాడుతూ, 'సాహో' చిత్రం ఒప్పుకోకుండా ఉండి ఉంటే ఒక మంచి చిత్రం మిస్ అవ్వడమే కాదు.. ప్రభాస్ వంటి అత్యుత్తమ ఫ్రెండ్‌ని కూడా మిస్ అయ్యేదానినని చెప్పుకొచ్చింది. నేను కలిసిన అద్భుత వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. నేను ప్రభాస్ కెరీర్‌కి సంబంధించిన విషయాలనే ఎక్కువగా మాట్లాడుకునే వారిమని, వ్యక్తిగత అంశాలు మా వద్ద ప్రస్తావనకు వచ్చేవి కాదని తెలిపింది. ఇక ప్రభాస్ పెళ్లి విషయం నాకు తెలియదు. నేనెప్పుడు ఆ విషయం ఆయన్ను అడగలేదు. అది ఆయన వ్యక్తిగత విషయం. ప్రభాస్ పెళ్లి గురించి నన్ను కంటే ప్రభాస్‌ని అడిగితేనే బాగుంటుందని అని చెప్పుకొచ్చింది.