మహేష్‌కి మాస్ నుంచి క్లాస్ వరకు, అమ్మాయిల నుంచి ఆంటీలు, ముసలివారు, చిన్నారులు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా హీరోలకు చిన్నారులు ఫ్యాన్స్‌గా ఉన్నారంటే వారికి స్టారడమ్ రావడం ఖాయం. మిగిలిన వర్గాల ప్రేక్షకుల కన్నా పిల్లల్లో క్రేజ్ ఉండే హీరోలు తమ పిల్లల కోసం ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకి వెళ్లి రావడం కామన్. కాబట్టే చిన్నారులలో పేరు తెచ్చుకున్న హీరోలకు ఫ్యామిలీలోని అన్ని వర్గాల ఆదరణ దక్కుతుంది. నాటి చిరంజీవి నుంచి నేటి ప్రభాస్ వరకు స్టార్‌డమ్ తెచ్చుకోవడం వెనుక చిన్నారుల అభిమానం పొందడమే కారణం.
ఇక తాజాగా మహేష్‌బాబుకి అమెరికాకి చెందిన చిన్నారి నేహ ఓ లెటర్‌ని రాయడం విశేషం. సాధారణంగా మన దేశంలోనే నేడు లెటర్‌ల కాలం చెల్లిపోయి మెసేజ్‌లు, ఇంటర్నెట్‌లో లెటర్స్ ప్రత్యక్ష్యమవుతున్నాయి. కానీ అమెరికాకి చెందిన ఈ చిన్నారి మాత్రం లెటర్‌ని రాసి పోస్ట్ చేయడం బాగా ఆసక్తిని కలిగిస్తోంది. తమ స్కూల్లో ఎవరో ఒక సెలబ్రిటీకి లెటర్ రాయాలని చెప్పడంతో నేహా మహేష్‌కి లెటర్ రాసింది. డియర్ మిస్టర్ ఘట్టమనేని అంటూ ప్రారంభించిన ఆమె లేఖను చూసి మహేష్ ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.
ఆ లెటర్ చదువుతూ ఎంతో సంతోషించానని చెప్పిన మహేష్, తన గురించి, తన చిత్రాల గురించి ఆ చిన్నారి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ పాపలాగే తమ గౌతమ్‌కృష్ణ, సితారలకు కూడా శ్రీమంతుడు చిత్రం ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. ఆ పాపను బాగా చదువుకొని పైకి రావాలని సూచించాడు. మొత్తానికి ఈ లేఖ మహేష్‌కి చిన్నారులలో ఉన్న క్రేజ్‌కి అద్దం పడుతుంది. ప్రస్తుతం మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ఏప్రిల్ నుంచి తన 25వ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభించనున్నాడు.