తన కెరీర్‌లో ఎప్పుడు ఎదుర్కోని విమర్శలను 'అజ్ఞాతవాసి'తో త్రివిక్రమ్ అందుకున్నాడు. చివరకి ఆయన ఫ్లాప్ చిత్రం 'ఖలేజా' కూడా కొందరి ప్రశంసలను పొంది ఇప్పటికీ టీవీ చానెల్స్‌లో వస్తే మంచి ఆదరణ చూరగొంటోంది. ఇక 'అజ్ఞాతవాసి' విషయంలో మాత్రం అందరు తప్పుని ఏకగ్రీవంగా త్రివిక్రమ్ వైపే చూపిస్తున్నారు. పవన్, నిర్మాత రాధాకృష్ణలపై కూడా రాని విమర్శలు త్రివిక్రమ్‌కి వచ్చాయి. 125 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం రెండో రోజు నుంచే కలెక్షన్లలో తీవ్రమైన డ్రాప్‌తో నష్టపోయింది. బయ్యర్లకు పెట్టిన పెట్టుబడిలో 50శాతం కూడా తిరిగిరాలేదు. 60శాతం నష్టాలతో వారు వీధుల్లో పడ్డారు. దీంతో రాధాకృష్ణ తన వంతుగా 20కోట్లు వారికి తిరిగి ఇవ్వనున్నాడు.
త్రివిక్రమ్ కూడా తన రెమ్యూనరేషన్‌లో కొంత రిటర్న్ చేయనున్నాడు. అయితే పవన్ విషయం మాత్రం అర్దం కావడం లేదు. ఇక ఇప్పటికే పవన్ మీద 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు' బయ్యర్లు రోడ్లెక్కుతున్నారు. ఇక రాధాకృష్ణ తదుపరి తాను త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ హీరోగా తీసే చిత్రాన్ని కూడా 'అజ్ఞాతవాసి' వల్ల నష్టపోయిన వారికే ఇవ్వనున్నారని సమాచారం. ఇక 'అజ్ఞాతవాసి' వల్ల త్రివిక్రమ్‌పై కాపీ మరక కూడా అంటుకుంది. త్రివిక్రమ్ తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సునీల్, ఆర్.పి.పట్నాయక్‌లతో కలిసి పంజాగుట్టలోని ఓ రూమ్‌లో ఉండేవాడు. ఆ రూమ్‌లో ఆయన రాసిన కథలు, డైలాగ్స్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో ఆ రూమ్‌ని సెంటిమెంట్‌గా భావించి దానిలో తాను ఉండకపోయినా నెల అద్దెను త్రివిక్రమ్ కడుతున్నాడు.
ప్రస్తుతం ఈ రూంలోనే ఎన్టీఆర్ చిత్రం స్క్రిప్ట్ విషయంలో మరో ముగ్గురు అసిస్టెంట్స్‌తో కలిసి త్రివిక్రమ్ పనిచేస్తున్నాడట. ఇక ఈ చిత్రం కూడా యద్దనపూడి సులోచనా రాణి, మధుబాబు నవలల పాయింట్ ఆధారంగా రూపొందనుందని అంటున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు. మరోసారి అలాంటి పని చేసి త్రివిక్రమ్ తన స్థాయిని మరింత తగ్గించుకోడనే అంటున్నారు.