దీపికా పడుకొనే నటించిన 'పద్మావత్' చిత్రం విడుదలకు ముందే ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చివరకు సుప్రీంకోర్టు సాయంతో విడుదలై అద్బుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. రాజ్‌పుత్ సేన చెప్పినట్లుగా ఇందులో వారిని చిన్నచూపుగా, అవమానకరంగా చూపించే దృశ్యాలేమీ లేవు. ఇంకా వారిని ఎంతో ఉన్నతంగా చూపించారు. మరోవైపు ఖిల్జీని ఎంతో క్రూరంగా చూపించారు. ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా పాకిస్తాన్‌లో విడుదలకు అనుమతి ఇవ్వగా, ముస్లింలను తప్పుగా చూపించారనే సాకుతో మలేసియా ప్రభుత్వం ఈ చిత్రం విడుదలను ఆపేసింది.. మొత్తానికి చిత్రంలో ఏమి ఉందో తెలుసుకోకుండా ఆందోళనలు చేసే వారిది తొందరపాటు తనమే తప్ప మరోటి కాదని ఈ చిత్రం నిరూపించింది.
ఇక ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో బ్రహ్మాండమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ చిత్రం యూఎస్‌లో ఆడుతున్న ఓ థియేటర్‌ని రాజ్‌పుత్ వంశస్తులందరూ బుక్ చేసుకుని, పద్మావత్ డ్రస్‌లో సినిమాకి వెళ్లి ఘూమర్ సాంగ్‌కి మూకుమ్మడిగా థియేటర్లలోనే డ్యాన్స్‌లు వేశారు. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో సంజయ్‌లీలా బన్సాలీ, దీపికా పడుకొనే తలలు, ముక్కు తీసుకుని వచ్చిన వారికి భారీ బహుమతులు ప్రకటించారు. దీనిపై దీపికా మాట్లాడుతూ, నా ముక్కు అంటే నాకెంతో ఇష్టం. దానిని కోసుకుని రమ్మని చెప్పవద్దు. కావాలంటే నా పొడవైన కాళ్లను కోసుకెళ్లండి. ఇలాంటి వారి బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కోవాలి. నా చిన్నతనంలో ఓ వ్యక్తి నన్ను కావాలని తాకుతూ వెళ్తే చెంపలు వాయించాను అని చెప్పుకొచ్చింది.