యూత్‌ఫుల్, కాలేజీ డేస్‌ని గుర్తుకు తెచ్చే చిత్రాలు సాధారణంగా ప్రేమికుల రోజును టార్గెట్ చేస్తూ ఉంటాయి. అందుకే కన్నడ హిట్ మూవీ 'కిర్రాక్‌పార్టీ' తెలుగు రీమేక్‌ని హీరో నిఖిల్ కూడా ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించాడు. కానీ అదే రోజున రెండు మూడు చిత్రాలు బాగా పోటీ పడుతున్నాయి. దాంతో ఫిబ్రవరి 16న గానీ లేదా 24వ తేదీన గానీ విడుదల చేస్తే బాగుంటుందని యూనిట్ భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఇది కాలేజీ కంటెంట్ ఉన్న యూత్‌ఫుల్ చిత్రం కావడంతో యువతకు సెలవులు వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేస్తే సోలో మూవీగా వస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడట. అదే విషయాన్ని ఆయన నిర్మాత అనిల్ సుంకరకి చెప్పాడని, అనిల్ సుంకర కూడా అదే తరహా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. సో ఈ చిత్రానికి సోలో రిలీజ్ డేట్ ఈ రెండు నెలల్లో వచ్చే అవకాశం లేదు. దాంతో సినిమా పూర్తయిన తర్వాత ఏకంగా మే వరకు వెయిట్ చేసి రిలీజ్ చేయాలంటే ఫైనాన్స్ మీద వడ్డీలు బాగా పెరిగి పోతాయనేది మరో వాదన, మరోవైపు 'కిర్రాక్‌పార్టీ' టీం కూడా ఎలాంటి ప్రమోషన్ల హడావుడి లేకుండా కామ్‌గా ఉండటం చూస్తే ఈ చిత్రం విడుదల వాయిదా పడిందనే అనుమానం బలపడుతోంది. ఇక నిఖిల్ సరసన ఈ చిత్రంలో సంయుక్తా హెగ్డే నటిస్తుండగా, కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. మాటలు, స్క్రీన్‌ప్లేలను నిఖిల్‌కి ఎంతో క్లోజ్ అయిన ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్ అయిన చందు మొండేటి, సుధీర్ వర్మలు చూసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ, 'జయం, నువ్వునేను' వంటి కాలేజీ చిత్రాలు విడుదలైనప్పుడు నేను కాలేజీలు ఎగ్గొట్టి ఆ చిత్రాలు చూశాను. అలాంటి నేను శేఖర్ కమ్ముల గారి 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకుని ఈ చిత్రం షూటింగ్‌ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ 'కిర్రాక్‌పార్టీ' మరలా కాలేజీ డేస్‌ని గుర్తుకు తెచ్చింది. ఈ చిత్రం పూర్తయిన రోజున యూనిట్ అందరం ఎంతో బాధతో ఏడ్చేశామని చెప్పుకొచ్చాడు.