గతంలో మెగా ఫ్యామిలీపై వచ్చిన గాసిప్స్ మరే ఫ్యామిలీ మీద రాలేదంటే నమ్మాలి. అయితే ఇప్పుడు ఈ మధ్యన అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ గాసిప్స్ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అఖిల్ పెళ్లి విషయం కానివ్వండి, నాగ చైతన్య - సమంతల వివాహం కానివ్వండి ఇలా చాలా రకాల వాటిమీద కొన్ని నిజమైన న్యూస్ ఉంటే.... చాలానే గాసిప్స్ కూడా వున్నాయి. ఇప్పుడు కూడా తాజాగా అక్కినేని ఫ్యామిలీపై పొలిటికల్ గాసిప్స్ ఎక్కువయ్యాయి. అక్కినేని సమంత తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తుందని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో అక్కినేని ఫ్యామిలీ కున్న తత్సంబందాలతో సమంత ఇలా రాజకీయాల్లోకి వస్తుందనే న్యూస్ మీడియాలో హైలెట్ అయ్యింది.
ఇప్పుడు తాజాగా నాగార్జున కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. గత పదేళ్లుగా నాగార్జున, రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొనసాగించడం, ఆయన హాయాంలోనే నాగార్జున ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసేందుకు సిద్దమయ్యాడని అనేవారు. మరి అప్పట్లో సాధ్యంకానీ ఆ పని ఇప్పుడు వైసిపి నేత జగన్ ఆధ్వర్యంలో నాగ్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడనే గాసిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
అందులో భాగంగానే వైసిపి నేత జగన్, నాగార్జున కోసం ఒక ‘హాట్ సీట్’ సిద్ధం చేసినట్లుగా వైసిపీ నేతల భోగట్టా. వైసిపికి కుడి భుజమైన ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో నాగార్జునకి సంబందించిన ఈ అసెంబ్లీలో సీటు వ్యవహారం నడుస్తుందనే టాక్ వినబడుతుంది. మరి ఈ పొలిటికల్ విషయాల మీద అటు సమంతగాని ఇటు నాగార్జున గాని ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఈ ఫేక్ న్యూస్ లు మాత్రం రోజు రోజుకి సోషల్ మీడియా పుణ్యమా అని తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.