సినిమాని సినిమాగా, హీరోలను కూడా మానవులుగా చూసే కాలం పోయి అదేదో పాతకాలం లాగా దేవుళ్లుగా భావించే సంస్కృతి పెరుగుతోంది. హీరోల కాళ్లకు పైకి నమస్కారాలు వద్దు అని చెప్పినా, అలాంటి వాటిని కొందరు కోరుకుంటారనేందుకు కూడా ఎందరో హీరోలు నిదర్శనంగా ఉన్నారు. ఇక ఈ పద్దతి తమిళ తంబీల నుంచి తెలుగుకి బాగా పాకింది. అక్కడ కటౌట్లు, పూలమాలలు, పాలాభిషేకాలే గాక బీరుతో కూడా అభిషేకాలు చేస్తారు. ఇక ఖుష్బూ, నమిత వంటి వారికి గుళ్లుగోపురాలు కట్టేస్తుంటారు. రజనీ విషయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు.
ఇక అజిత్ తన పేరు మీద అభిమాన సంఘం ఉన్నా ఒప్పుకోడు. రజనీ నాకు పాదాభివందనం చేయకండి..పాపం..మీ తల్లిదండ్రులకు చేయమని చెప్పినా, అజిత్ వద్దని చెప్పిన అభిమాన సంఘాల పేరుతో నానా రచ్చ చేస్తుంటారు. ఇక ఆ మధ్య ఇంగ్లాండ్‌లో విక్రమ్ కాళ్లకి ఓ అభిమాని మొక్కితే విక్రమ్ ఏమి చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక 'గ్యాంగ్' వేడుకలో వద్దని చెప్పిన సూర్య అభిమానులు ఆయన కాళ్లకు పాదాభివందనం చేస్తే ఆయన తిరిగి అదే అభిమానుల కాళ్లకు నమస్కారం చేయడంతో అభిమానులు షాక్‌కి గురై కాస్త తగ్గారు.
ఇక తాజాగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నటించిన 'ఇంటెలిజెంట్' చిత్రంలోని 'కళా కళామందిర్' పాటను విడుదల చేసిన సందర్భంగా తేజూని చూడటానికి వచ్చిన అభిమానులు పాదాభివందనం చేశారు. దాంతో తేజూ కూడా వాళ్ల కాళ్లకి నమస్కారం చేయడంతో వారు సర్దుకుని షేక్ హ్యాండ్‌తో తృప్తి పడిపోయారు. ఇది సూర్యని చూసి చేశాడా? లేదా? అనే పోలికను పక్కన పెడితే అభిమానుల అత్యుత్సాహం, చేయవద్దని వారిస్తున్నా వినని వారికి ఇదే సరైన ట్రీట్‌మెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక తాజాగా సూర్యాపేటకి చెందిన ఫిజికలీ చాలెంజెండ్ ప్యారా అథ్లెట్‌కి సాయి లక్షరూపాయలు సాయం చేసి ఆయన పోటీలలో పాల్గొనేలా చేసిన ఘటనపై మాత్రం తేజూ అభిమానులు ఎంతో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.