కాలం మారుతోంది. సాంకేతికంగా ఎదిగే కాలంలో ఉన్నాం అని గొప్పలు చెప్పుకుంటాం గానీ మనం రాతియుగం కంటే పూర్వ కాలానికి పయనిస్తున్నాం. కులం, మతం, మహిళపట్ల అసభ్య ప్రవర్తన వంటి విషయాలను చూస్తే మనం ఆది మానవులకంటే హీనంగా ఉన్నామని అర్ధమవుతోంది. పాతకాలంలో మేలుగా ఉండేది. ఏదైనా గ్రామంలో, వీధిలో ఏదైనా జరిగితే చుట్టుపక్కల ఉండే వారందరు తమకు జరిగిన ఘటనగా భావించి గుమ్మికూడి కలిసికట్టుగా ఉండేవారు. కానీ నేటి రోజుల్లో మనం పక్క మనిషికి ఏమి జరిగినా? మనకి కాదు కదా...! మనం ఎందుకు దానిలో పూసుకోవాలి. నిందలకు తాము ఎందుకు పగకావాలి? అని భయపడే పరిస్థితుల్లో సమాజంలోని మనుషులు ఉన్నారు. ఇక మలయాళ నటిభావన కిడ్నాప్, అత్యాచారం కేసు నుంచి హాలీవుడ్ వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
తాజాగా అమలాపాల్‌పై లైంగిక వేధింపుల ఘటన జరిగిందో లేదో తాజాగా మరో నటిపై అలాంటి దాడే జరిగింది. ఇక నటీమణులు పలు షూటింగ్‌లు, రద్దీ ప్రదేశాలలో ఉండేటప్పుడు కూడా తాకరాని చోట తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం మామూలైపోయింది. దాంతో మహిళలు మరింత జాగరూకతతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ప్రముఖ మలయాళ నటి సనూషకి కూడా ఇదే పరిస్థితి ఏదురైంది. బాలనటిగా 40 చిత్రాలకు పైగా నటించిన ఈమె పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' సినిమాలో హీరోయిన్ మీరాచోప్రా చెల్లెలి పాత్రను పోషించడంతో పాటు ఆ మధ్య వచ్చిన 'జీనియస్' చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఈమె చెన్నై నుంచి కేరళ వెళ్లేందుకు ట్రైన్ ఎక్కి తనబెర్త్‌పై పడుకున్న సమయంలో ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
దాంతో ఆమె ధైర్యంగా అతని చేతిని పట్టుకుని లైట్స్ ఆన్ చేసి బోగీలో ఉన్న ఎస్కార్ట్ పోలీసులకు అతడిని అప్పగించి అరెస్ట్ చేయించింది. ఇంత కంటే దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ సంఘటన జరిగే సమయంలో అదే బోగీలో పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏమీ కలుగు జేసుకోకుండా మౌనంగా ఉండటం ఆమెని మరింత భయాందోళనకి గురిచేసింది. పోలీసులు అతడిని పట్టుకుని వెళ్లేవరకు ఆమె అక్కడే నిలబడింది. ఈ విషయం గురించి ఆమె చెబుతూ, ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొవాలని నాకు తెలుసు. అయినా నా కుటుంబసభ్యుల నుంచి పూర్తి మద్దతు నాకు ఉండటం ఆనందంగా ఉంది. ఏ అమ్మాయి అయినా ఇలా జరిగితే మౌనంగా ఉండి లేట్‌గా రియాక్ట్ కావద్దు. అలాంటి వారికి వెంటనే బుద్ది చెప్పాలి.. అని చెప్పడం చూస్తుంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవడంతో పాటు మౌనంగా ఉన్న వ్యక్తుల తీరుని కూడా తీవ్రంగా ఖండించాల్సి ఉంది.
నేరం చేసే వారు మాత్రమే కాదు.. వాటిని చూస్తూ మౌనంగా ఉండే సాక్ష్యులను కూడా కేసుల్లో పరిగణనలోకి తీసుకోవాలని నిబంధన విధిస్తే గానీ ఇలాంటి ఆకతాయిలు, మౌనంగా ఉండే వారిలో కాస్తైనా జ్ఞానోదయం కాదు. అదే తమ భార్య, తల్లి, అక్కా చెల్లెలికి జరిగినా అలాగే వారు ప్రవర్తిస్తారా? అనేది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.