ఏ హీరో అయినా రాజమౌళితో చిత్రం చేస్తే బ్లాక్‌బస్టర్, కీర్తిప్రతిష్టలు వచ్చి చేరుతాయి. తమ కెరీర్‌లోనే ఎవరు కనివిని ఎరుగని హిట్‌ని అందుకుంటారు. కానీ ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత ఆయా హీరోలు నటించే తదుపరి చిత్రాలు ఏవీ ఆ రేంజ్‌లో ఉండే ఛాన్సేలేదు. దాంతో ఆయా హీరోలు రాజమౌళి చిత్రాల తర్వాత పలు గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. రవితేజ, రామ్‌చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ఎందరో హీరోలు ఈ కోవకి వస్తారు. అయితే 'బాహుబలి' తర్వాత మాత్రం ఈ సెంటిమెంట్‌ని ఆయా చిత్రాలలో నటించిన నటీనటులు బ్రేక్ చేస్తున్నారు.
'బాహుబలి'లో విలన్ భళ్లాలదేవగా నటించిన రానా 'నేనే రాజు నేనే మంత్రి'తో పెద్ద హిట్ కొట్టాడు. ఇక 'బాహుబలి' చిత్రంలో దేవసేనగా కేకపుట్టించిన అనుష్క తాజాగా విడుదలైన 'భాగమతి' చిత్రంతో సూపర్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయిన చిత్రాలలో కేవలం బాలయ్య నటించిన 'జైసింహా' మాత్రమే పెట్టుబడితో పోల్చుకుంటే హిట్ అనిపించుకుంది. అది కూడా పెద్ద హిట్ కాదు. చివరకు టాలీవుడ్‌కి 'భాగమతి'గా వచ్చిన స్వీటీనే తొలి హిట్‌ని అందించిందని చెప్పుకోవాలి.
ఇక మిగిలింది ప్రభాస్ వంతు. ఇక రాజమౌళి సెంటిమెంట్ కూడా ఎక్కువగా హీరోలకే వర్తిస్తుంది. హీరోలకు మాత్రమే ఆయన చిత్రాల తర్వాత సరైన హిట్స్ పడవు. మరి 'సాహో'తో ప్రభాస్ చరిత్రను తిరగరాస్తే మాత్రం జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్‌కి బ్రేక్ కావడం ఖాయమని చెప్పవచ్చు.