గత ఏడాది గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాలతో పాటు జై సింహ సినిమాలో నటించిన బాలకృష్ణ కుర్ర హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ తనకి ఇంకా వయసైపోలేదని నిరూపించాడు. ఇప్పుడు కూడా 'జై సింహా' అలా ఫినిష్ అయ్యిందో లేదో తన తండ్రిగారి బయోపిక్ ని పట్టాలెక్కించేస్తాడని అనుకున్నారు బాలయ్య అభిమానులు. అయితే మరో మూడు నాలుగు నెలల వరకు ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కే ఛాన్స్ లేదని వినికిడి.
కారణం బాలయ్య బాబు రెస్ట్ లో ఉన్నారనే టాక్ నడుస్తుంది. బాలకృష్ణ కి పైసా వసూల్ టైం లో భుజానికి గాయమైందని... అది చిన్న దెబ్బె అని డాక్టర్స్ చెప్పడంతో ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా పైసా వసూల్ ని పూర్తి చెయ్యడం.. అలాగే వెంటనే 'జై సింహా' తో మళ్లీ సెట్స్ మీదకెళ్ళడం... జై సింహాలో బాలయ్య డూప్స్ లేకుండా ఫైట్స్ చెయ్యడంతో ఆ భుజం నెప్పి తిరగబెట్టింది. అలాగే 'జై సింహా' డాన్స్ ల విషయంలోనూ బాలయ్య కాస్త కష్టమైన స్టెప్స్ వేయడంతో చెయ్యి నొప్పి తిరగబెట్టిందంటున్నారు.
అందుకే భుజానికి వెంటనే ఆపరేషన్ చేయాలని.... ఎంత లేదన్నా బాలకృష్ణ మూడు నుంచి నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉండటంతో బాలయ్య తన తండ్రి బయోపిక్ విషయంలో తాజాగా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ మీద నందమూరి అభిమానుల్లో ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అందుకోసమే బాలయ్య కూడా ఆ సినిమా మీద అమితాసక్తిని కనబరుస్తున్నాడు. అందులో భాగంగానే ఆ సినిమాని ఎప్పుడెప్పుడు మొదలెడదామా అని కాచుకుని కూర్చున్నాడు. అయితే బాలకృష్ణ సన్నిహితులు మాత్రం ఈ వయసులో రిస్క్ వద్దని... పూర్తిగా కోలుకున్నాక సినిమాలు కంటిన్యూ చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారట.