ఈ మధ్యన ఏదైనా సినిమా ట్రైలర్ విడుదలవడం చాలు ఆ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమా ఏదో... ఒక హాలీవుడ్ మూవీ నుండో.. లేకుంటే ఏదో ఇతర భాష మూవీ నుండో.. లేదా ఏదో ఒక నవల నుండి కాపీ కొట్టేశారంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు క్రిటిక్స్. వారనడం కాదు గాని నిజంగానే మన దర్శకుల దగ్గర క్రియేటివిటీ తక్కువైనదా అనే అనుమానం మాత్రం పెను భూతంలాగా మారిపోతుంది కొందరిలో. మరి మహా మహా డైరెక్టర్స్ కూడా ఇతర భాషల సినిమాలను మక్కికి మక్కి తెలుగు ప్రేక్షకుల మీద రుద్దేస్తున్నారు. పెద్ద డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద స్టార్స్ తో తీసే సినిమాలను ఏదో ఒక హిట్ సినిమాతో ఇన్స్పైర్ అయ్యి మరి తీసేస్తున్నారు.
మొన్నటికి మొన్న త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' ని కాపీ చేశాడు. ఇక తాజాగా 'భరత్ అనే నేను' సినిమా కూడా కొరటాల హాలీవుడ్ మూవీని కాపీ చేశాడనే న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ - వక్కంతం కాంబోలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' సినిమా కూడా కాపీ అనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ కథని ఒక హాలీవుడ్ సినిమా కథ నుంచి వక్కంతం వంశీ తీసుకొని రాసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆంట్వోనే ఫిషర్ అని తెరకెక్కిన ఈ మూవీ ఫైండింగ్ ఫిష్ అనే బుక్ ని బేస్ చేసుకొని రాశారు.
దాని ఆధారంగానే 'నా పేరు సూర్య' కథ ఉంటుందనే టాక్ బలంగానే వినబడుతుంది. అయితే ఆ మూవీలో హీరో చాలా కోపంతో ఊగిపోయే వ్యక్తిగా కనిపిస్తాడట. చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాక అమెరికా నావీలో చేరతాడు. గతంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల హీరో టెంపర్ తో ఊగిపోతూ ఉంటాడు. అయితే దీన్ని గమనించిన ఒక డాక్టర్ హీరోని మామూలు మనిషిగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ తరువాత ఆ డాక్టర్ హీరోకి గాడ్ ఫాదర్ లాగా మారిపోతాడట. మరి 'నా పేరు సూర్య' టీజర్ చూసిన దగ్గర నుండి ప్రచారం జోరందుకుంది.
ఇకపోతే ఆ ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ నటిస్తే.. డాక్టర్ గా సీనియర్ హీరో అర్జున్ నటించాడు ఈ సినిమాలో. దీన్ని బట్టి వక్కంతం ఒక హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఈ నా పేరు సూర్యని తెరకెక్కిస్తున్నాడన్నమాట. అది నిజమా కదా అనేది నా పేరు సూర్య రిలీజ్ వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.