నిజానికి విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్‌గా పేరొంది ఇటీవల విశ్వనట సార్వభౌమ పురస్కారం అందుకున్న మంచు మోహన్‌బాబు నటనలో ప్రత్యేకత గురించి విడమరిచి చెప్పాల్సిన పనిలేదు. సరైన పాత్ర, డైలాగ్‌లు పడ్డాయంటే ఆయనలోని సంపూర్ణ నటుడు ఒక్కసారిగా కదం తొక్కుతాడు. కానీ ఆయనకు సరైన పాత్ర వచ్చి ఎంతో కాలమైంది. అసెంబ్లీ రౌడీ, యం.ధర్మరాజు ఎంఏ తర్వాత మరలా ఆయన నటనా విశ్వరూపాన్నిచూసే అవకాశం రాలేదు. కానీ తాజాగా ఆయన ఎం.బి. 42గా తన లక్ష్మీప్రసన్న బేనర్‌లో తానే నిర్మాతగా నిర్మిస్తున్న 42 వ చిత్రంగా 'గాయత్రి' చిత్రం వస్తోంది. 'ఆ నలుగురు' వంటి చిత్రానికి మాటలు వహించి, 'పెళ్లైన కొత్తల్లో' తో దర్శకునిగా తానేంటో నిరూపించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ మదన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం మదన్‌కి కూడా మంచి హిట్‌నిస్తుందనే నమ్మకం ఈ చిత్రం ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతోంది.
ఇక ఈ చిత్రానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైమండ్ రత్నబాబు అందించిన సంభాషణలు ఎంతో బాగున్నాయని చెప్పాలి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో హాట్ యాంకర్, నటి అనసూయ ఓ లేడీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తుండటం విశేషం. ఆమెనుద్దేశించి 'మన మంత్రిపై కేసు పెట్టిన జర్నలిస్ట్. ఒకసారి ఫోకస్ పెట్టిందంటే వదిలేరకం కాదు అనే డైలాగ్‌ని రాజారవీంద్ర చేత చెప్పించడం వెంటనే దానికి కౌంటర్‌గా మోహన్‌బాబు 'అది వదిలేరకం కాదు.. నేను దొరికే రకం కాదు' అనే డైలాగ్ పేల్చడంతో ఈ ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు 'యం. ధర్మరాజు ఎంఏ' తరహాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా, మంచు విష్ణు, శ్రియలు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా అనసూయ ప్రసంగం, మంచు ఫ్యామిలీ సమయస్ఫూర్తి బాగా ఆకట్టుకున్నాయి. అనసూయ మాట్లాడుతూ, మంచు ఫ్యామిలీ అందరినీ ప్రోత్సహిస్తుంది. అందుకు నేనే ఉదాహరణ, 'మిస్టర్‌నూకయ్య' చిత్రంలో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న బేబి స్టెప్స్ వేసుకుంటూ, పిచ్చి బట్టలేసుకుని నోటికొచ్చింది వాగాను. నాటి నుంచి మంచు ఫ్యామిలీ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంది. నేడు మోహన్‌బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. అని చెప్పుకొచ్చింది. అయితే ఇంతలో మోహన్‌బాబు చేయి చూపిస్తూ ఆపు అన్నట్లుగా సంకేతాలిచ్చాడు. వెంటనే మంచు విష్ణు మాట్లాడుతూ, ఒరేయ్ మనోజ్.. నీ చిత్రంలో ఈమె చిన్నపిల్లట్రా? అన్నాడు. దానికి ఆమె అప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నాను అని చెప్పడం నా ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది.