ఒకవైపు సమ్మర్ సెలవుల్లో ఏప్రిల్‌లో మహేష్‌బాబు 'భరత్ అనే నేను', అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' రెండు చిత్రాల మధ్య పోటీ తప్పేలా లేదు. ఇద్దరు ఏప్రిల్ 27నే రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక మార్చి చివరి వారంలో కూడా భారీ పోటీకి రంగం సిద్దమవుతోంది. ఈ సీజన్‌లో విడుదలయ్యే చిత్రాలన్నింటిలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ - రామ్‌చరణ్‌ల 'రంగస్థలం 1985' చిత్రం మార్చి 30న రావడం ఖాయమైపోయింది. ఇదే తరుణంగా నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ తాను హీరోగా నటిస్తున్న 'ఎమ్మెల్యే'( మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) చిత్రాన్ని మార్చి 29కి ఖరారు చేశారు.
ఇక ఈ తరుణంలో సీజె వర్క్స్ ఇంకా పూర్తి కావడానికి టైం తీసుకునే అవకాశం ఉండటంతో అశ్వనీదత్ నిర్మిస్తున్న 'మహానటి' చిత్రం పోస్ట్‌పోన్ కావడం ఖాయమని కొందరు భావించారు. కానీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని మార్చివేస్తే ఆ తర్వాత ఇతర భాషల్లో వరుస చిత్రాలు లైన్‌లో ఉండటం వల్ల అక్కడ ఈ సినిమాకి మరో డేట్ దొరకడం కష్టంగా భావిస్తున్నారు.
దాంతో మహానటిని కూడా ఎలాగైనా మార్చి 29నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ లెక్కన మార్చి చివరి వారంలో ఏకంగా మూడు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగనుండటం, మూడు విభిన్న చిత్రాలే కావడంతో ఇప్పటినుంచే ఈ చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి.