ఉత్తరాది నటీనటులకు రెండు మూడు మంచి హిట్ చిత్రాలు రాగానే వాటంతట అవే పద్మ పురస్కారాలు వెత్తుకుంటూ వస్తాయి. విద్యాబాలన్ నుంచి ప్రియాంకాచోప్రా వరకు ఈ కోవకే వస్తారు. ఇక దక్షిణాదిలో కైకాల సత్యనారాయణకు మాత్రం ఇప్పటి దాకా పద్మపురస్కారం లభించకపోవడం దారుణం. ఈయన సినిమా పరిశ్రమకి చేసిన సేవలు అనన్య సామాన్యం. విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో పాటు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే అతి అరుదైన నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. దక్షిణాది నుంచి సంగీత రంగంలో ఇళయరాజాకి పద్మవిభూషణ్ లభించడం సంతోషించదగిన విషయమే.
ఈ అవార్డును పొందిన సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం నాకు పద్మవిభూషణ్ అందించింది అంటే తమిళ ప్రజలందరినీ గుర్తించినట్లేనని అన్నారు. మరి కైకాల సత్యనారాయణను విస్మరించడం అంటే తెలుగు ప్రజలను మర్చిపోవడం కిందకే వస్తుంది. దక్షిణాదిలో కైకాల దరిదాపుల్లోకి రాలేని వారికి సైతం పద్మ పురస్కారాలు లభించాయి. ఇక కైకాలకు పద్మ పురస్కారం రాకపోవడంలో తెలుగు సినీ పెద్దల చేతగానితనం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఒక భాగమే. ప్రభుత్వాలు కైకాలకు ఈ పురస్కారం లభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్‌కే భారతరత్న రానప్పుడు కైకాల గురించి ఎన్ని మాట్లాడినా కంఠశోష తప్ప మరో ఉపయోగం లేదు. దీంతో విసిగి వేసారిన సత్యనారాయణ ఇటీవల తాను డబ్బును పెట్టి అయినా పద్మ అవార్డును కొనాలని భావించానని, కానీ కె.విశ్వనాథ్ వారించాడని చెప్పడం వెనుక ఆయనలోని ఆవేదన మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కైకాలకు పద్మ పురస్కారం రాలేదంటే అది ప్రభుత్వాలకు, పద్మ పురస్కారాలకే సిగ్గుచేటని భావించాలి.