గతంలో ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తన మ్యూజికల్ నైట్స్‌లో ఇళయరాజా స్వరపరిచిన పాటలను పాడటం పట్ల ఇళయరాజా నిరసన తెలిపి, తన అనుమతి లేకుండా తన పాటలు పాడుతున్నందుకు తనకి కూడా లాభాలలో వాటా ఇవ్వాలని లీగల్ నోటీసులు ఎస్పీబాలసుబ్రహ్మణ్యంకి పంపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక దీనికి కారణం, ఇళయరాజా తాను సంగీత కచ్చేరిలను విదేశాలలో ఇవ్వాలని భావించినప్పుడు బాలుని కూడా ఆహ్వానిస్తే బాలు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినందువల్లే ఇళయరాజా ఇలా కసితీర్చుకున్నాడని వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇళయరాజాకి పద్మవిభూషణ్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కమల్, రజనీకాంత్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా ఇళయరాజాకి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇళయరాజాకి పద్మవిభూషణ్ రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. గౌరవప్రదమైన రిపబ్లిక్‌డేని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. జై భారత్.. పద్మ అవార్డులకి ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు. శ్రీ ఇళయరాజాని చేరడంతో పద్మవిభూషణ్‌కి గౌరవం లభించింది..అంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ని చేశాడు.