తారక్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోయే చిత్రం గురించి కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే వున్నాయి. గత ఏడాది ఈ వార్తలని నిజం చేస్తూ వీరి కలయికలో చిత్రం అనౌన్స్ చేసి ముహూర్తం షాట్ కి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించి ఆయన సమక్షంలో ఓపెనింగ్ చేసుకోవటంతో ఈ ప్రాజెక్ట్ కి ఉన్న క్రేజ్ మరో పది రెట్లు పెరిగింది. అయితే అజ్ఞాతవాసి విడుదలైన నాటి నుంచి తారక్ అభిమానులు సోషల్ మీడియాలో వారి భయాందోళనలని వెలిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ మరియు సంగీతం విషయంలో అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరచటంతో తారక్ కి ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియో సందేశాలు పంపుతున్నారు.
సంగీత దర్శకుడిగా అనిరుద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సరికాదంటూ, దేవిశ్రీప్రసాద్ కి అవకాశం కలిపిస్తే మరో హిట్ ఆల్బమ్ వస్తుందని సలహాలు ఇస్తూనే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై కూడా పునః పరిశీలనా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా అభిమానులు కోరిక మేరకు ఎలాంటి మార్పులు సూచించని తారక్ స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా పక్కాగా వున్నాడట. బౌండ్ స్క్రిప్ట్ విని ఓకే చేసుకున్న కథే అయినప్పటికీ కథలో ఎలాంటి మార్పులు చేయకుండా కథనంలో ప్రతి అక్షరం పరిశీలిస్తూ అవసరమైన మార్పులు సూచిస్తూ త్రివిక్రంతో అనేక సిట్టింగ్స్ జరుపుతున్నాడట తారక్. ఈ స్క్రిప్ట్ రివైజింగ్ పనులు ఆలస్యం అవుతుండటంతో ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 14 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చనే వార్త కూడా వినిపిస్తోంది.