నాగశౌర్య.. ప్రస్తుతం ఉన్నయంగ్ హీరోలలో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీనీ సాధిస్తున్నాడు. తాజాగా ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఏపీ, తమిళనాడు బోర్డర్ గ్రామం కథతో 'ఛలో' చిత్రం చేస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక మండన్న ఈ చిత్రంలో చేస్తుండగా, నాగశౌర్య సొంతగా ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా నాగశౌర్య స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ, ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. నేను చాలా చిన్నవాడిని, నన్ను ప్రోత్సహించినందుకు ఆనందంగా ఉంది. ఆయన చేయి నా భుజంపై పడింది అది చాలు. సార్ ఏమైపోయారు సార్.. 10ఏళ్ల నుంచి ఇటు వంటి ఫంక్షన్లకు, అభిమానులకు దూరంగా ఎలా ఉన్నారు సార్...! మీరు లేకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం ఆడియో ఫంక్షన్లను హోటల్స్‌లో జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. జరుపుకుంటోంది ఆడియో ఫంక్షనో లేక రిసెప్షనో తెలియని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ మెగాస్టార్ వచ్చారు. ఆడియో పంక్షన్లంటే ఏమిటో చూపిస్తాం. మరలా 100రోజుల వేడుకలు చూస్తాం.. 175రోజుల వేడుకలు కూడా చూస్తాం.
మెగాస్టార్ ఉన్నప్పుడు 1,2,3,4 అనే నెంబర్లు ఉన్న కుర్చీలు ఉండేవి. ఆయన లేని తర్వాత కుర్చీలే లేవు. అంతా నిలబడటమే. మరలా వచ్చారు. కుర్చీ తెచ్చుకున్నారు. ఆ కుర్చీలో ఆయన కూర్చున్నారు. ఆయన కుర్చీ కోసం ఎవ్వరూ రారు రాలేరు కూర్చోలేరు. కుర్చీ ఆయనది కాదు. ఆయన కోసమే కుర్చీ పుట్టింది. మరలా జన్మంటూ ఉంటే మా అమ్మానాన్నలకు కొడుకుగానే పుడుతాను. మరలా మెగాస్టార్ అభిమానిగానే పుడతాను అంటూ ఉద్వేగంతో ప్రసంగించాడు.