యువ హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ ముందుంటాడు. శర్వానంద్ నుంచి నాగశౌర్య వరకు ఆయన ఈ విధానం పాటిస్తాడు. తాజాగా చిరంజీవి మాట్లాడుతూ, నాగశౌర్య చాలా బాగుంటాడు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి కావాలి. అలాంటి వారు రావడం వల్ల కొత్తరక్తం, ఫ్రెష్‌నెస్‌లు ఇండస్ట్రీకి వస్తాయి... అని చిరు చెప్పాడు. నాగశౌర్య సొంతంగా తానే నిర్మాతగా నటిస్తున్న'ఛలో' చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేడుకకు రావాలని నాగశౌర్య, వాళ్ల అమ్మగారు మా ఇంటికి వచ్చారు. అడిగిన వెంటనే వస్తానని చెప్పాను. ఎందుకంటే నా కెరీర్ మొదటి రోజులు నాకు గుర్తుకు వచ్చాయి.
ఆ రోజుల్లో నేను నటించిన చిత్రం శతదినోత్సవ వేడుకకు నేను అభిమానించే ఓ స్టార్‌హీరోని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆ స్టార్ బిజీగా ఉండటం వల్ల నేను రావడం లేదు. ఏమీ అనుకోవద్దని చెప్పారు. ఆ స్టార్ లేకుండా జరిగిన ఆ ఫంక్షన్ ఏదో తూతూ మంత్రంగా జరిగింది. ఆ రోజున చాలా నిరుత్సాహం అనిపించింది. ఆ స్టార్ హీరో వచ్చి ఉంటే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం వేరుగా ఉండేవి. ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నాను. ఈ ఫంక్షన్‌కి నేను రావాలని నాగశౌర్య కోరుకున్నాడంటే దాని ద్వారా అతను పొందే ప్రోత్సాహం, సంతోషం ఎక్కువని తెలుసుకున్నాను. అందుకే అతడిని ప్రోత్సహించేందుకు ఈ ఫంక్షన్‌కి నేను వచ్చాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన చెప్పింది కూడా వాస్తవమే.
ఇక ఈ వేడుక సందర్భంగా నాగశౌర్య అండ్ టీం మాత్రం మెగాస్టార్ ఈ వేడుకకు వస్తున్నాడని చెప్పి అతని పేరు ముందు పద్మభూషణ్ అనే బిరుదును తగిలిచింది. కానీ ఈ అవార్డులని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోకూడదని ఇప్పటికే కోర్టులు చెప్పి ఉన్నాయి. ఓ చిత్రం టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందంలకు వీటిని వేయడం తీవ్ర దుమారాన్నే రేపిన సంగతి తెలిసే ఉంటుంది.