మొన్నటి సంక్రాంతికి వచ్చిన చిత్రాలు ఏవీ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒక్క 'జైసింహా' చిత్రం మాస్‌ని మెప్పించింది. ఇక గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న రవితేజ 'రాజా దిగ్రేట్'గా వచ్చిన కొంతకాలానికే 'టచ్‌చేసి చూడు'గా వస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే ఇది కూడా మాస్ ప్రేక్షకులకు మంచి విందు పెట్టేలానే ఉంది. 'రేసుగుర్రం, మిర్చి' చిత్రాలకు కథను అందించిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. గతంలో 'విక్రమార్కుడు, పవర్' వంటి చిత్రాలలో పవర్‌ఫుల్ పోలీసుగా కనిపించిన రవితేజ ఇందులో యూనిఫాం ఉంటే ఎలా ఉంటాడు? యూనిఫాం లేకుండా ఉంటే ఎలా ఉంటాడు అనే తేడాను బాగా చూపెట్టారు.
ఇక రవితేజ తరహా యాక్షన్, మాస్, కామెడీ, సెటైర్లు, పంచ్‌లకు కొదువేలేదు. రాశిఖన్నా, సీరత్‌కపూర్‌లు తమ అందాలతో ఆకట్టుకోవాలని చూశారు. ఇక ప్రీతమ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించేలా ఉంది. చోటాకెనాయుడు ఫొటొగ్రఫీ మాత్రం బాగుంది. ఓ కుటుంబానికి ప్రేమించే కొడుకుగా తన జోలికి వస్తే రప్ఫాడించే పాత్రను రవితేజ ఎంతో ఈజ్‌తో చేశాడు. 'యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు.. అదే యూనిఫాంలో తీసేస్తే దానమ్మ.. దానమ్మ రాయితో చంపుతానో.. రాడ్డుతో చంపుతానో..
అంటూ పోలీసుగా ఆయనిచ్చే వార్నింగ్‌లు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. వక్కంతం వంశీ కథను అందించిన ఈ చిత్రంలో కాస్త పోకిరి చిత్రం ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ద్వారా మరో పవర్‌ఫుల్ పోలీసుగా రవితేజ ఎలా ఇరగదీస్తాడో వేచిచూడాల్సివుంది..!