కొత్తగా వచ్చిన పార్టీలు అధికార పక్షం లేదా విపక్షంపై విమర్శలు, వారి కంటే ప్రజా సమస్యలపై తొందరగా స్పందించడం వంటివి చేయాలి. అలా చేస్తేనే పార్టీ బలం పెరిగి, గట్టి పునాది ఏర్పడుతుంది. కానీ పవన్ మాత్రం తాను ప్రతి విషయాన్నిరాజకీయం చేయను అంటున్నాడు. ఇది మంచి నిర్ణయం అయితే అదే సమయంలో సమస్యలపై బలంగా పోరాడటం, విమర్శలు చేయడం ద్వారానే పవన్ మనుగడ సాధ్యమవుతుంది. ఇక రాజకీయ రభసకి, ప్రజాసమస్యలపై పోరాటానికి మద్య ఉన్న సున్నితమైన తేడాను పవన్ తెలుసుకోలేకపోతున్నాడు. ఎంతసేపు సున్నిశితంగా, అధికార పక్షాలకు మద్దతు ఇస్తూ పోతే ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు.
చంద్రబాబు నాయుడు మంచి మేధావి, ముందుండి నడిపించగలిగిన గొప్ప అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అంటున్నాడు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ని స్మార్ట్ సీఎంగా పేర్కొన్నాడు. బహుశా దీని వల్ల ఆయా అధికార పార్టీలతో ఎన్నికల నాటికి పొత్తుకి ఇవి ఉపయోగపడతాయేగానీ అధికారంలోకి రావడానికి ఇవి ఉపయోగపడవు. బహుశా పవన్ తనకు అధికారం మీద ఆశలేదు. నా బలమెంతో నాకే తెలియదు. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే నా బలం నాకు తెలుస్తుంది. బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే పోటీ చేస్తాం. ఎన్నికల ముందు రెండు నెలల వరకు ఎక్కడెక్కడ పోటీ చేస్తామో చెప్పలేనని అందుకే అంటున్నాడు.
ఇక తెలంగాణలో ప్రతిపక్షంగా విఫలమవుతున్న కాంగ్రెస్, బిజెపిలకు, ఏపీలో ప్రతిపక్షంగా విఫలమవుతున్న వైసీపీ స్థానాలను భర్తీ చేసి ప్రజల సమస్యలపై పోరాటం చేసి, ప్రతిపక్షాలుగా విఫలమవుతున్న వారిని ప్రశ్నించి ముందుకు సాగితేనే జనసేనకి బలం పెరుగుతుంది కానీ కేవలం నేను ప్రతిది రాజకీయం చేయను. సమస్య తెలుసుకుని అధికార పక్షాల ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తాను అని చెప్పడం అంటే కేవలం ఓట్లు చీలికకు, అధికార పార్టీకి తోకలా మాత్రమే జనసేన భవిష్యత్తు ఉంటుందని అర్ధమవుతోంది.