నిన్న మొన్నటి వరకు తెలుగులో మదర్ సెంటిమెంట్, ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్స్ చిత్రాలు కనక వర్షం కురిపించేవి. నాటి 'రక్త సంబంధం' నుంచి 'పుట్టింటికిరా చెల్లి, గోరింటాకు' వంటి చిత్రాలన్నీ సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొంది, ఘన విజయం సాధించిన చిత్రాలే. ఇక మదర్ సెంటిమెంట్ గురించి చెప్పాలంటే 'మదర్ ఇండియా' నుంచి కోకొల్లలు ఉన్నాయి. ఇక రామ్‌చరణ్ సిస్టర్ సెంటిమెంట్‌తో చేసిన 'బ్రూస్‌లీ' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన వదిన సెంటిమెంట్‌పై దృష్టిపెట్టాడు. ఇక ఇప్పుడు వదినల సెంటిమెంట్ రాజ్యమేలుతోంది.
ఇటీవల వచ్చిన 'ఎంసీఏ' చిత్రంలో హీరోహీరోయిన్ల సీన్స్‌కంటే వదిన భూమిక, మరిది నానిల మద్య వచ్చే సీన్సే ఎక్కువ స్పేస్ తీసుకున్నాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను, రామ్‌చరణ్‌ల కాంబినేషన్ లో ప్రారంభమైన డివివి దానయ్య చిత్రం కూడా వదిన సెంటిమెంట్‌తోనే రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌కి ఏకంగా నలుగురు వదినలు ఉంటారట. స్నేహ, 'జర్నీ' ఫేమ్ అనన్య, కొత్తవారైన హిమజ, ప్రవీణలు రామ్‌చరణ్‌కి వదినలుగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్ర స్నేహది. ఇక స్నేహకి భర్తగా అంటే రామ్‌చరణ్‌కి పెద్దన్నయ్యగా తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ నటించనున్నాడని తెలుస్తుంది. మిగిలిన ముగ్గురు అన్నయ్యలు ఎవరో తెలియాల్సి వుంది...!
'సింహా, లెజెండ్, జయజానకినాయకా' వంటి చిత్రాలతో బోయపాటి శ్రీను తాను సెంటిమెంట్ కూడా బాగా పండించగలనని నిరూపించుకున్నాడు. ఇక గతంలో రామ్‌చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో మదర్, ఫాదర్, వదినల సెంటిమెంట్ ఉన్నా కూడా సినిమా వర్కౌట్ కాలేదు. మరి ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను సెంటిమెంట్, యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో 'భరత్ అనే నేను'లో మహేష్‌బాబుకి జోడీగా నటిస్తూ తెలుగు తెరకి పరిచయం అవుతున్న కైరా అద్వానీ రామ్‌చరణ్‌కి జోడీగా నటిస్తోంది. మరి నలుగురు వదినలు, అన్నయ్యల ముద్దుల తమ్ముడిగా రామ్‌చరణ్ ఎంత వరకు సెంటిమెంట్‌ని పండిస్తాడో వేచిచూడాల్సివుంది...!