నేటి హీరోయిన్లు ఫేడవుట్ అయ్యే దాకా ఫీల్డ్‌ని వదలడంలేదు. ఇక చూడలేం బాబోయ్ అంటున్నా పెళ్లి చేసుకుని మరలా తల్లి, వదిన పాత్రలకు వస్తున్నారు. కానీ కృష్ణకుమారి అలా కాదు. పెళ్లయిన తర్వాత కుటుంబం, పిల్లలు, భర్తలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 'ఏకలవ్య' చిత్రం తర్వాత దూరంగా వెళ్లిపోయింది. మరలా దాసరి నారాయణరావు బలవంతం మీద ఆయన దర్శకత్వం వహించిన 'ఫూల్స్' చిత్రంలో 19ఏళ్ల తర్వాత కనిపించింది. ఇక కృష్ణకుమారి ఎన్టీఆర్ స్థాపించిన ఎన్‌ఏటి సంస్థలో మొదటి చిత్రం 'పిచ్చిపుల్లయ్య' నుంచి ఎన్నో చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్‌తో 25 చిత్రాలు, ఏయన్నార్‌తో 18 చిత్రాలు నటించిన ఆమె కత్తి కాంతారావుతో అత్యధికంగా 28 చిత్రాలలో నటించి మెప్పించింది. ఆమె నేటికి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల ద్వారానే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.
ఇక ఈమె బెంగుళూరులో కొంత కాలం అనారోగ్యంగా ఉంటూ రథసప్తమి రోజున (బుధవారం) తుది శ్వాస విడిచింది. ఇక ఈమె షావుకారు జానకి సోదరి. కోల్‌కత్తాలో పుట్టిన తెలుగమ్మాయి. అయితే ఆమెకి చీరకట్టుకోవడం రాదు. ఆమె ఏయన్నార్‌తో నటించేటప్పుడు ఆమె చీర కట్టుకోవడంలో పడుతున్న ఇబ్బందిని గ్రహించి ఏయన్నార్ తాను నాటకాలలో ఎక్కువగా చీరకట్టుతో ఆడవేషాలు వేసిన అనుభవంతో ఆమెకి చీరకట్టడం నేర్పించారు. ఇక ఈమె 'లక్షాధికారి' చిత్రంలో 'మబ్బుల్లో ఏముంది...' అనే పాటను సముద్రపు ఒడ్డున అలలలో చిత్రీకరిస్తున్నారు.
ఓ పెద్ద అల వచ్చి ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఆమెకి ఈతరాదు. కానీ షూటింగ్‌లో భాగంగా ఆమె చేయి పట్టుకుని ఉన్న ఎన్టీఆర్ బలవంతంగా ఆమె చేయిని విడవకుండా గట్టిగా పట్టుకోవడంతో ఆమె బతికి బయటపడింది. ఇక 'బందిపోటు' చిత్రం సమయంలో ఆమె గుర్రపుస్వారీ చేస్తుండగా, గుర్రం అదుపు తప్పిన సమయంలో కూడా ఆమెని ఎన్టీఆరే కాపాడారు. ఇక ఈమె రెబెల్‌స్టార్ కృష్ణంరాజు నటించిన మొదటి చిత్రం 'చిలకాగోరింక'లో నటించి ఆయన సరసన నటించి తొలి కథానాయిక అయింది.