దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కోలీవుడ్‌లో వయసు మీద పడుతున్నా క్రేజ్ తగ్గని సూపర్‌స్టార్‌గా నయనతారని చెప్పుకోవాలి. తెలుగులో అనుష్కకి అయిన 'వర్ణ, సైజ్‌జీరో, పంచాక్షరి' వంటి ఫ్లాప్ ఉన్నాయి. ఆమె ఇప్పుడు సీనియర్ అయిపోయింది. కానీ నయన పరిస్థితి వేరు. ఆమె ఊ అంటే తమ చిత్రాల్లో తీసుకోవడానికి కుర్రహీరోల నుంచి స్టార్స్, సీనియర్ స్టార్స్, కొత్తహీరోలు కూడా ఉత్సాహం చూపిస్తారు. కానీ నయన మాత్రం ఈమద్య గ్లామర్ పాత్రలు చేసే స్థాయి నుంచి తాను సూపర్‌స్టార్‌గా ఎదిగానని గ్రహించి లేడీ ఓరియంటెడ్ పాత్రలకే ఓకే చెబుతోంది. బాలయ్య 'జైసింహా'లో కూడా ఆయన తన చేతి చిటికిన వేలుని కూడా తాకనివ్వలేదు. ఇదంతా దర్శకుడు విఘ్నేశ్‌శివన్ పుణ్యమే అంటారు.
ఇక ఆమె గత చిత్రం 'ఆరమ్'లో పవర్‌ఫుల్ కలెక్టర్ పాత్రలో అదరగొట్టింది. కాసుల వర్షం కురిపించుకోవడంతో పాటు అన్ని రివ్యూలలో 4కిపైగా రేటింగ్స్‌ని పొందింది. ఇక దీనికి సీక్వెల్ చేయడానికి కూడా ఆమె సిద్దమవుతోంది. ఇక 'ఆరమ్' చిత్రం సమయంలో కూడా ఆ చిత్ర నిర్మాతలు అర్ధాంతరంగా తప్పుకుంటే నయన తానే నిర్మాతలను తెచ్చి తాను కూడా భాగస్వామిగా వ్యవహరించింది. ఆ చిత్రం సాధించిన విజయం చూస్తే కథలను నమ్మి, ఏవి హిట్ అవుతాయో చెప్పగల సత్తా, జడ్జిమెంట్ నయనకు ఉన్నాయని బాగా ప్రశంసలు లభించాయి.
ఇక ఈమె.. 'ఈరమ్, కుట్రమ్ 23' చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అరివలగన్ దర్శకత్వంలో ఓ చిత్రం ఒప్పుకుంది. డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాతలు తప్పుకున్నారు. కానీ నయన మాత్రం మంచి సినిమా ఆగిపోయిందే అని బాధపడటం లేదు. ఈ చిత్రానికి తానే స్వయంగా నిర్మాతలను సెట్ చేయాలని, వీలుకాకపోతే తానే పూర్తి స్థాయి నిర్మాతగా మారాలని కూడా నిర్ణయించుకుందిట. మొత్తానికి ఆగిపోతే పోయిందిలే.. వేరేప్రాజెక్ట్ చూసుకుందామని భావించకుండా తాను నమ్మిన కథను ఆమె ఎలాగైనా తీయాలని చూపిస్తున్న తపన చూసి అందరు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది...!