మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా హారిక హాసిని క్రియేషన్స్ వారి సంస్థలోనే సినిమాలు చేస్తూ ఆ నిర్మాణ సంస్థని తన హోమ్ ప్రొడక్షన్ హౌస్ గా మార్చేసుకున్నాడు. వీరి కాంబినేషన్ లో పలు విజయాలు తద్వారా కాసులు బాగానే వచ్చాయి కానీ ఒక్క డిజాస్టర్ ఈ లెక్కలన్నిటిని మార్చేసింది. ప్రొమోషన్స్ విషయంలో హారిక హాసిని క్రియేషన్స్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంది. అయితే ఒకవేళ అజ్ఞాతవాసి చిత్రం ఆడి వుండి ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులే తమ హీరో చిత్రానికి పబ్లిసిటీ అవసరమే లేదు, తమ హీరో పేరే పెద్ద పబ్లిసిటీ అని చెప్పుకునే వారు. కానీ సినిమా ఆడక పోయేసరికి వారే ఇప్పుడు ప్రొమోషన్స్ సరిగ్గా చేయలేదని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థపై ఆగ్రహంగా వున్నారు.
సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ ఆరోపణలు హారిక హాసిని క్రియేషన్స్ పై చెరగని మచ్చగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన అధినేత రాధాకృష్ణ చిత్ర పంపిణీదారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన నష్టాలలో 20 కోట్ల రూపాయల నష్టం తాను భరించేటట్టు ఒప్పందం చేసుకున్నారట. అయితే అజ్ఞాతవాసి వలన వచ్చే నష్టం 60 కోట్ల రూపాయలకి పైమాటే. అందుకోసం ఈ 20 కోట్ల రూపాయలతో పాటు తమ సంస్థలో రాబోయే తారక్ మరియు విక్టరీ వెంకటేష్ ల చిత్రాలని అందుబాటు రేట్లకి ఇచ్చి, తదుపరి చిత్రాల ప్రొమోషన్స్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించి తమ ప్రొడక్షన్ హౌస్ పై పడ్డ మచ్చ చెరిపేసుకునేలా తగు హామీలని పంపిణీదారులకి ఇచ్చి పంపారట నిర్మాత రాధాకృష్ణ.