సినిమా స్టోరికి అనుగుణంగా, పూర్వకాలం నాటి భవంతులు సృష్టించి, అద్బుతమైన సెట్స్ వేసి, దర్శకుడి మదిలో ఉన్న భావాలకు సెట్స్ ద్వారా రిచ్‌నెస్ తేవడంలో ఆర్ట్ డైరెక్టర్లది కీలక పాత్ర, ఇక ఆర్డ్ డైరెక్టర్ల విషయానికివస్తే రవీందర్‌కి మంచి పేరుంది. 'ఛత్రపతి, మగధీర, ఈగ, మర్యాదరామన్న, డీజె, అత్తారింటికిదారేది' వంటి అనేక చిత్రాలలో ఆయన తన ప్రావీణ్యం చూపించారు. ఇక తాజాగా ఆయన అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శత్వంలో రూపొందిన 'భాగమతి'కి కూడా వర్క్ చేశారు. శుక్రవారం విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం కోసం వందల కాలం ముందు ఉండే ఓ భవంతి కావాలని రవీందర్‌ని దర్శకుడు జి.అశోక్ కోరాడట. ఎక్కడ తిరిగినా అలాంటి భవంతి దొరకలేదు. దాంతో రవీందర్ ఎంతో రీసెర్చ్ చేసి 29రోజుల పాటు రోజుకి 200 మంది పని వారితో ఈ చిత్రం కోసం వందల ఏళ్లనాటి భవంతిసెట్‌ని తీర్చిదిద్దాడట. ఈ భవంతి కోసమే ఏకంగా మూడు కోట్లు ఖర్చయిందట.
ఈ సెట్ 28వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు. ఓ రాజు తన రాణికి ఇచ్చిన బహుమతిగా ఉండే ఈ భవంతిలోనే మెజార్టీ షూటింగ్‌ని పూర్తి చేశారు. టీజర్, ట్రైలర్స్‌లో ఈ భవంతి బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో 12 గదులు, 189 స్తంభాలు ఉంటాయి. ఆకాలంలో లిఫ్ట్ సౌకర్యం ఉండేది కాదు. దాంతో రెండస్థుల్లో ఉండే ఈ భవంతిలో ఎంతో రీసెర్చి చేసి జనాలు తాళ్లతో లాగే లిఫ్ట్ వంటివి, కలర్, లైటింగ్స్ వంటి అన్నీ అద్భుతంగా ఉంటాయని రవీందర్ చెబుతున్నాడు.
ఈ భవంతి సెట్ వల్ల టెక్నీషియన్స్ మరింతగా కష్టపడేలా ఈ భవంతి స్ఫూర్తిగా నిలిచింది. ఇక ఈసెట్‌ని చూసేందుకు రామ్‌చరణ్, అల్లుఅర్జున్, సుకుమార్, వినాయక్ వంటి వారు ప్రత్యేకంగా వచ్చి ఈ సెట్‌ని మెచ్చుకుని అభినందించారట. ఇక రవీందర్ ప్రస్తుతం నాగచైతన్య-రమ్యకృష్ణ-మారుతిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'శైలజారెడ్డి అల్లుడు', ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం, తమిళంలో ఓ చిత్రం, సుధీర్‌వర్మ చిత్రాలు చేస్తున్నాడు. మొత్తానికి అదృష్టం కలిసి వచ్చి సోలోగా విడుదలవుతున్న 'భాగమతి' చిత్రం ఎలా ఉంటుంది? ఈ చిత్రంలో భవంతి సెట్ ఎలా ఆకర్షణగా మారుతుందనేది ఆసక్తిగా మారింది.