సినిమా ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణది కూడా కీలక పాత్ర. రాజీవ్‌గాంధీకి ఆయన ఎంతో సన్నిహితుదు. ఆ అభిమానంతోనే నాడు బలంగా ఉండి, ఎవరినైనా శాసించే స్థాయిలో రాజకీయంగా ఎదిగిన స్వర్గీయ ఎన్టీఆర్‌ని విబేధించడానికి ఆయన వెనుకాడలేదు. మన ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కి మద్దతు తెలపాలని ఒత్తిళ్లు వచ్చినా తలవంచలేదు. నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల కన్ను పొగొట్టుకుని మరీ ఏలూరు నుంచి ఎంపీగా గెలిచి తనసత్తా చాటాడు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారు. అదే రాజీవ్‌గాంధీ బతికుంటే ఏపీలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కృష్ణనే సీఎం అయ్యేవాడు. ఇక కృష్ణ సతీమణి విజయనిర్మల కొంతకాలం టిడిపికి అనుకూలంగా ఉన్నారు. ఇక నరేష్ అయితే బిజెపిలో ఎప్పటినుంచో కొనసాగుతున్నాడు.
ఇక కృష్ణ అల్లుడు, మహేష్‌బాబు అత్యంత ఎక్కువగా గౌరవించే బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపి. కానీ కిందటి ఎన్నికల్లో చంద్రబాబుని గుడ్డిగా పూర్తిగా మద్దతు తెలపకుండా కేవలం తన బావని గెలిపించాలని మాత్రమే మహేష్ కోరి తాను తన బావ విషయం తప్ప మిగిలిన వాటిలో తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, తాను తటస్తుడిని అని నిరూపించుకున్నాడు. ఇక కృష్ణ సోదరుడు, మహేష్‌బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు మాత్రం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా ఉండేవాడు. అదే ఉద్దేశ్యంతో ఆయన వైసీపీలో చేరి జగన్‌కి వంత పాడుతున్నాడు. ఇక నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆదిశేషగిరిరావు మహేష్ ఫ్యాన్స్‌ని సమావేశ పరిచి వైసీపీకి సపోర్ట్ ఇవ్వమని కోరాడు.
ఇక తాజాగా ఆయన పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ రాజకీయం ఓ కామెడీ ఎపిసోడ్. ఆయన మాట్లాడే మాటలకు అర్ధం ఉండదు. తోలు బొమ్మలాటలో మద్యలో కేతిగాడికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ వెళ్తుంటాడు. చంద్రబాబు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి వారికి అనుకూలంగా మాట్లాడి పవన్ వెళ్లిపోతుంటాడు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉంటే పవన్ ఏనాడైనా సరైన సమయంలో స్పందించాడా? టిడిపి ఏది మాట్లాడమంటే 'జనసేన' అది మాట్లాడుతుంటుంది అని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మొత్తం వ్యాఖ్యలు బాగానే ఉన్నా తోలు బొమ్మలాటలో కేతిగాడు వచ్చిపోయినట్లు అని పవన్‌ని కేతిగాడితో పోల్చడం పట్ల పవన్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అదే పవన్.. వైసీపీకి అనుకూలంగా ఉండి ఉంటే ఆదిశేషగిరిరావు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా? అప్పుడు పవన్ కేతిగాడు కాకుండా గొప్పవాడై పోతాడా? ఏదిఏమైనా ఈ వ్యాఖ్యల ప్రభావం పవన్, మహేష్ అభిమానుల మద్య వైరానికి తెరతీసే విధంగా ఉంది. ఇప్పటికైనా మహేష్ తన బాబాయ్ వ్యాఖ్యలకు తనకు సంబంధంలేదని చెప్పాల్సిన అవసరం ఉంది...!