తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి నిన్న మొన్నటి 'మనం' వరకు ఎన్నో ఏళ్లు తెలుగుసినీ చరిత్రకు బతికున్న దిగ్గజంగా, వాకింగ్ ఎన్‌సైక్లోపీడియాగా అక్కినేని నాగేశ్వరావుని చెప్పుకోవచ్చు. నాటి ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు నుంచి నిన్నటి తరం చిరంజీవితో 'మెకానిక్ అల్లుడు' నాగార్జునతో 'ఇద్దరు ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు' వంటి కొన్ని చిత్రాలు, బాలకృష్ణతో 'గాండీవం' వెంకటేష్‌తో 'బ్రహ్మరుద్రులు' ఇలా టాప్ స్టార్స్‌తోనే కాదు సుమంత్, సుమన్, వినోద్‌కుమార్ నుంచి హరీష్‌ల వరకు వారితో కలిసి నటించాడు. తన 70ఏళ్ల వయసులో కూడా వయోజన విద్య కాన్సెప్ట్‌తో శరత్ దర్శకత్వంలో ఆయన హరీష్, డిస్కోశాంతిలతో 'కాలేజీ బుల్లోడు'లో వేసిన స్టెప్స్, మెగాస్టార్‌తో పోటీగా 'మెకానిక్ అల్లుడు'లో వేసిన డ్యాన్స్, బాలకృష్ణ, రోజా, మోహన్‌లాల్ వంటి వారితో 'గాండీవం'లో చూపించిన హుషారుని ఎవ్వరూ చూపించలేకపోయారు.
తెలుగు సినీ చరిత్రే తన చరిత్రగా చెప్పుకోదగిన ఈ లెజెండ్, నట సామ్రాట్ అక్కినేని క్యాన్సర్‌తో పోరాడి చివరి చిత్రంగా 'మనం' చిత్రం చేసి తన కుమారుడు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్, అమలతో కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకున్నారు. ఇక తను ఎక్కువ కాలం బతకనని తెలుసుకుని 'మనం' చిత్రంలో తన పాత్రను వేగంగా పూర్తి చేయడం, ఈ చిత్రం కోసం తాను తొందరగా డబ్బింగ్ చెప్పకపోతే తన మరణానంతరం మిమిక్రీ ఆర్టిస్టు చేత డబ్బింగ్ చెప్పుకోవాల్సిన దుస్థితి రాకూడదని భావించి మంచం మీదనే ఉండి డబ్బింగ్ చెప్పి, చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాననే తన మాటను సార్థకం చేసుకున్న మహానటుడు ఏయన్నార్.
ఇక ఆయన నటించిన 'మనం' చిత్రం సెట్ కాలిపోవడం నిజంగా బాధాకరమైన సంఘటనే. ఇక ఈయనను నాగార్జున చివరి సారిగా తన ఫోన్‌లోంచి తీసిన పిక్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. నీవు లేకున్నా నీ గురించిన ఆలోచనలతో జీవితాన్ని సాగిస్తున్నాము.. మీరు మమ్మల్ని వదిలి నాలుగేళ్లు కావస్తోంది. ఇప్పుడు మేము చేయగలిగింది మిమ్మల్ని గుర్తు చేసుకుని నవ్వుకోవడమే. మీరు మరణించినా బతికే ఉన్నారు. మీ జ్ఞాపకాలతో మేము బతుకుతున్నాం అని ట్వీట్ చేసిన నాగ్ తాను చివరి సారి తన ఫోన్‌లోంచి ఏయన్నార్‌ని బంధించిన ఫొటోని, 'మనం' పోస్టర్‌ని కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకుని జ్ఞాపకాల దొంతరలోకి మనల్ని కూడా తీసుకెళ్లాడనే చెప్పాలి.