తమన్ సంగీత దర్శకునిగా తన తొలి చిత్రమే రవితేజ సినిమాకి పనిచేశాడు. స్టార్ హీరోల చిత్రాలనేకం సంగీతం అందించి వేగంగా 50 చిత్రాలకు సంగీతం అందించిన ఘనత సాధించాడు. అయితే ఆయనపై కాపీ ముద్ర, ఒకే మూసలో ఉంటాయి అనే విమర్శలతోపాటు రణగొణ ద్వనులు తప్ప ఆయనకు మెలోడీలు చేతకావనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాపీ క్యాట్ ముద్ర ఆయనపై బలంగా పడింది. దాంతో ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్‌కి పోటీ ఇచ్చిన తమన్ తర్వాత సైడ్ ట్రాక్ పట్టాడు. కానీ ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్‌లో మాత్రం మణిశర్మ తర్వాత తానే అనిపించుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన 'తొలిప్రేమ' ఆడియో, 'భాగమతి' ఆడియోలతో ఆయన తనలో దాగి ఉన్న అసలైన క్రియేటర్‌ని లేటుగా అయినా బయటికి తెచ్చాడు. ముఖ్యంగా వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న 'తొలిప్రేమ'కి ఆయన అందించిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నాటి పవన్‌కళ్యాణ్‌కి 'తొలిప్రేమ' చిత్రం పవన్‌కి తొలి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు. పవన్-కీర్తిరెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన 'తొలిప్రేమ' చిత్రం పవన్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించిది. అది కరుణాకరన్‌కి తొలి చిత్రం. ఇప్పుడు వరుణ్‌తేజ్-రాశిఖన్నా నటిస్తున్న 'తొలిప్రేమ' కూడా వెంకీ అట్లూరికి తొలి చిత్రం. ఇక నాటి 'తొలిప్రేమ' పాటలు రికీ మార్టిన్ పాటలను కాపీ కొట్టారనే విమర్శలు వచ్చాయి. కానీ ఈ తొలిప్రేమకి తమన్ అందించిన పాటలు మాత్రం ఇంతకు ముందు ఎవ్వరూ టచ్ చేయని యాంగిల్‌లో ఉన్నాయనే ప్రశంసలు లభిస్తున్నాయి.
పైగా ఈ ట్రెండ్‌కి తగ్గట్లుగా ఈ పాటలు ఉండటం, ఇంతకు ముందులా తాను సినిమా చూడకముందే ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులని కొనలేదని, సినిమాని చూసిన తర్వాత అద్భుతంగా ఉండటంతోనే 'తొలిప్రేమ' డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొన్నానని దిల్‌రాజు చెబుతున్నాడు. అసలు ఈ కథ తన వద్దకే వచ్చిందని, వెంకీ మొదట తనకే ఈ స్టోరీ చెప్పినా తాను నాడు 'ఫిదా'లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయానని, మొత్తానికి ఈ చిత్రం హక్కులని మాత్రం బివిఎస్ ఎన్ ప్రసాద్ నుంచి తాను తీసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నానని దిల్‌రాజు అంటున్నాడు. మరి 'ఫిదా'తో 50కోట్ల క్లబ్‌లో చేరిన వరుణ్‌తేజ్‌కి ఈ 'తొలిప్రేమ' తన బాబాయ్ 'తొలిప్రేమ'లా పెద్ద కమర్షియల్ హిట్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....!