నేడు ప్రతి ఒక్కరు ఒడ్డున కూర్చుని దేశం చెడిపోయింది. దేశం బాగు పడదు. సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు. అవినీతి రాజ్యమేలుతోంది. దేశంలో అసహనం పెరిగిపోతోంది. కులాల కుళ్లు కంపు కొడుతోంది. మత చాందస వాదం పెరిగిపోయింది అని నీతులు చెప్పేవారే గానీ.. ఆ బురదలోకి దిగి వాటిని ఎలా ప్రక్షాళన చేయాలో మాత్రం చెప్పడం లేదు. పరిష్కారం సూచించలేని వాడికి విమర్శించే అర్హతేలేదని చెప్పాలి. సినిమా ఫీల్డ్, రాజకీయాలు, వ్యాపారాలు అన్నీ లంచాల మయం, కుల మయం, పలు ప్రలోభాలకు కేంద్రం అయిపోయాయి.
ఇక విషయానికి వస్తే తాజాగా మోహన్‌బాబు దేశంలోని 95 శాతం మంది పొలిటీషియన్స్ రాస్కెల్స్‌గా బిహేవ్ చేస్తున్నారని, సమాజం చెడిపోయిందని, రాజకీయాలు భ్రష్టుపట్టాయని, రాజకీయ నాయకులు తాము చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదని, వారిచ్చే హామీలన్ని నెరవేరిస్తేనే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించాడు. దీనికి తోడు మరోసారి ఎన్టీఆర్ పేరును వాడుకున్నాడు. తన స్నేహితుడు, గురువైన ఎన్టీఆర్ వంటి నాయకుడు లేడని, లంచమంటే ఎరుగని మనిషి ఆయన. నన్ను రాజ్యసభకి పంపారు. ఒక్క మచ్చ లేకుండా నేను ఎంపీగా పనిచేశానంటూ భజంత్రీలు వాయించాడు. రాజకీయ నాయకులు రాస్కెల్స్ అంటే పొలిటీషియన్స్ ఏమైనా పైనుంచి ఊడి వస్తున్నారా? వారు కూడా మన మద్య నుంచే వెళ్తున్నారు వారిని మనమే ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. అలాంటప్పుడు సమాజంలోని అందరూ దీనికి బాధ్యులే. కాబట్టి పొలిటిషియన్స్ రాస్కెల్స్ అయితే మోహన్‌బాబుతో పాటు.. అందరం రాస్కెల్స్‌మే.
సరే.. మోహన్‌బాబుకి ఇంతకాలానికి దేశంలోని రాజకీయాలు తెలిసి వచ్చాయి. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో రాజకీయాలలోకి వస్తానని అప్పుడెప్పుడో ప్రకటించాడు. వైసీపీలో చేరాలని భావిస్తున్నాడు. ఆయన వైసీపీలోనే కాదు.. ఏ పార్టీలో చేరినా కూడా వారు కూడా రాస్కెల్సే కదా...! చివరకు ఆయన గురువు దాసరి మీద కూడా కుంభకోణాలు బయటపడిన విషయాన్ని, ఎన్టీఆర్ హాయంలో జరిగిన కుల జాడ్యానికి కారణం ఎవరో మోహన్‌బాబు ముందుగా చెప్పాలి.
ఇక ఈయన తన స్వంత భావాలతో పార్టీ పెడితే సంతోషమే. కనీసం ఆ ప్రయత్నమైనా పవన్‌కళ్యాణ్ చేస్తున్నాడు. విమర్శలు ఎదుర్కొంటూనే ముందుకు వెళ్త్తున్నాడు. మరి మోదీతో ఫ్యామిలీ ఫొటోలు దిగి, ఎన్టీఆర్‌ని దేవుడని చెప్పి, చంద్రబాబు, దాసరి ఇద్దరిని మచ్చిక చేసుకుని, వైఎస్ కుటుంబానికి బంధువుగా మారి, వైసీపీలో చేరాలని భావిస్తున్న మోహన్‌బాబు తన నిజాయితీ ఏంటో చెప్పాలి. తాను ఎంపీగా ఉన్నప్పుడు వాటి సౌకర్యాలన్ని అనుభవించిన ఆయన తన హయాంలో సినీ పరిశ్రమకి చేసిన మంచి ఏమిటి? ఆయన ఏనాడైనా సినీ రంగానికి సంబంధించిన సమస్యలను ఓ ఎంపీగా పరిష్కరించే ప్రయత్నం చేశాడా? అంటే లేదనే సమాధానం వస్తుంది.
కాబట్టి ఒట్టి మాటలు కట్టి పెట్టి, రాస్కెల్, సిల్లీ ఫెలోస్ అని అడ్డదిడ్డంగా మాట్లాడకుండా తన నిజాయితీ, పరిశ్రమ, పేద కళాకారులు వంటి వాటిలో తన గొప్పదనాన్ని నిరూపించుకోవాలి. అంతేగానీ కేవలం కుమారుల సినిమాలు అద్భుతం అంటూ, తమ గురించి, తమ గొప్పదనం గురించి మాట్లాడే ముందు ఈయన రజనీకాంత్‌ని చూసైనా జ్ఞానోదయం చేసుకోవాల్సి ఉంటుంది!