ఇటీవల బాలకృష్ణ నటించిన చిత్రంలోని డైలాగ్స్‌కి ట్రాఫిక్‌కి అన్వయిస్తూ పేరడీ డైలాగ్‌లను రాసి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల గురించి సోషల్ మీడయాలో పోస్ట్‌లు పెట్టారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. 'అర్జున్‌రెడ్డి' చిత్రంలో ఫుట్‌బాల్ ఆడేందుకు అర్జున్‌రెడ్డి స్మోక్ చేస్తూ, స్పోర్ట్స్ దుస్తుల్లో రాయల్ ఇన్‌ఫీల్డ్ మీద వెళ్లే సీన్ గుర్తుండే ఉంటుంది. కాగా ఈ ఫోటోని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడుకున్నారు. రోజూ మనదేశంలో హెల్మెట్ లేని వాహనాలను నడుపుతున్న లక్షల మంది చనిపోతున్నారని, వీరిలో అత్యధికులు టూవీలర్స్ నడిపేవారని, మరీ ముఖ్యంగా మృతుల్లో ఎక్కువ మంది తలపై తీవ్ర గాయాల కారణంగానే మరణిస్తున్నారని అధ్యయనంలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడిపితే సగం మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని పోలీసులు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు.
దీనిలో భాగంగా పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న విజయ్ దేవరకొండ ఫొటోని, గ్రాఫిక్స్ ద్వారా విజయ్‌కి హెల్మెట్ పెట్టిన మరో ఫొటోని పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన విజయ్ దేవరకొండ 'సారీ మామా..నెక్ట్స్ టైం పక్కా' అంటూ ట్వీట్ చేశాడు. అర్జున్‌రెడ్డి పోస్టర్‌ని చూపిస్తూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి అని పోలీసులు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుండటం విశేషం.