చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ నాయకుడే కాదు.. ఓ రాజనీతిజ్ఞుడు. రాష్ట్రానికి తాను సీఈవోనని నాడు సమైక్యాంధ్ర సమయంలో ప్రకటించుకున్నాడు. ఇక ఈయన నేడు దేశంలో ఉన్న సీఎంలందరి కంటే ప్రధాని మోదీ కంటే కూడా సీనియర్. ఈయన మొదటిసారి ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఎంతో బాగా పరిపాలన చేశారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. నాడు ఆయన ప్రభుత్వాధికారులతో కఠినంగా వ్యవహరించడం, ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రజాకర్షక పథకాలను కాకుండా అభివృద్ది మంత్రాన్ని జపించాడు. హైదరాబాద్‌ని సాఫ్ట్‌వేర్ హబ్‌గా మార్చడంతో ఆయనది ఎనలేని పాత్ర, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.
ఇటీవల ఓ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ విషయంలో చంద్రబాబు సేవలను తీసిపారేయలేమని చెప్పాడు. కానీ చంద్రబాబు ప్రస్తుతం మాత్రం ఏ పని చేస్తే ఏ కులం ఓట్లు వస్తాయి..? ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే ఓట్లు పోతాయేమో? పచ్చ చొక్కా వారికి, టిడిపి కార్యకర్తలకు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కావాల్సినంత దోచుకునే ఏర్పాటు చేస్తూ, కేవలం రంజాన్‌తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకల పేరుతో ఆయన కూడా ఓ సాధారణ పొలిటీషియన్ గానే కనిపిస్తున్నాడు. ప్రభుత్వోద్యోగుల ఓట్లు కీలకం కావడంతో ఆయన వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించడం లేదు.
కానీ ఆయన తన 40ఏళ్ల పొలిటికల్ ప్రస్తానం సందర్భంగా మాట్లాడుతూ నాయకులకు మంచి సూచనలే చేశాడు. నాయకులకు పనులు చేయడం ఎంత ముఖ్యమో, వారు పనులు చేసే విధానం కూడా ఎంతో ముఖ్యమని తెలిపాడు. ప్రజలు నాయకుల పనితీరునే కాదు వారు ప్రజల పట్ల వ్యవహరించే తీరుని, వారు మాట్లాడే పద్దతిని గమనిస్తూ ఉంటారని, పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో మమేకం కావడం, వారిని మెప్పించడం అంతే ముఖ్యమని తెలిపాడు. వచ్చే ఏడాదితో తాను రాజకీయాలలోకి వచ్చి 40ఏళ్లు అవుతుందని, తన పొలిటికల్ కెరీర్‌లో ఈ మూడున్నరేళ్ల పాలన తనకు ఎంతో తృప్తి ఇచ్చిందని, ఇంతటి తృప్తి ఇప్పటివరకు కలగలేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మాత్రం నిజం కాదు. ఎందుకంటే నాడు ఉన్న కఠినమైన సీఎం చంద్రబాబు ప్రస్తుతం లేడు.. ఈయన ఎంతో మారిపోయిన ముఖ్యమంత్రి అని ప్రజలు భావిస్తున్నారు.