మొత్తానికి అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన జనసేనాని పవన్ ఎట్టకేలకు పూర్తి స్థాయి రాజకీయాలలోకి వస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలపై అవగాహన ఏర్పరచుకుంటానని ప్రకటించాడు. తెలంగాణలోని జగిత్యాల మండలంలోని ప్రసిద్ద ఆంజనేయస్వామి ఆలయం ఉన్న కొండగట్టులో స్వామిని దర్శనం చేసుకుని, సకల మతాల ప్రార్థనల అనంతరం ఆయన తన యాత్రకు సిద్దమవుతున్నాడు.
ఇక తాను 2009లో ఇక్కడే జరిగిన ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డానని, అలాగే తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో కొండగట్టుని ఎంచుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత పవన్ ఏయే ప్రాంతాలలో ఎప్పుడు పర్యటిస్తాడు? ఎన్నిరోజులు పర్యటిస్తాడు? అనే విషయంలో త్వరలో కార్యచరణను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కొండగట్టు ఆలయం ఫొటోని కూడా పవన్ పోస్ట్ చేశాడు. మొత్తంగా తెలంగాణ నుంచి తన యాత్రను ప్రారంభిస్తూ పపన్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు.
దీనివల్ల తెలంగాణలో ఆయన తనకున్న పట్టుని కూడా చాటుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ పర్యటనలో ఆయన కేవలం ప్రజాసమస్యల గురించే చర్చిస్తారా? లేక ప్రభుత్వాలకు, ఇతర పార్టీలకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు కూడా చేస్తారా? అన్నది వేచిచూడాల్సివుంది. మరోవైపు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే పవన్ కూడా ప్రజల్లోకి రావడం వ్యూహాత్మక ఎత్తుగడగానే కనిపిస్తోంది.